Today Headlines in Telugu at 11PM
వైసీపీకి వంశీ రాజీనామా?
కాకినాడలోనే కాదు విశాఖలోనూ అదే సీన్ కనిపిస్తోంది. వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వంశీ, ఆయన వర్గీయులు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన వర్గం నేతలు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాల విషయం తెలుసుకున్న వైసీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వంశీ ఇంటికి వెళ్లిన పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కోలా గురువులు ఆయనతో ఏకాంతంగా చర్చించారు.
రాజీనామాల బాటలో వైసీపీ నేతలు..
కాకినాడ జిల్లాలో వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల చంటిబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చంటిబాబు వర్గం నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాలు చేసిన వారిలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, జడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, గండేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పరిమి మంగతాయారు ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.
ముగిసిన తొలి రోజు ఆట
భారత ఇన్నింగ్స్‌ల్లో 59 ఓవర్లు పూర్తి అయిన తరువాత వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కొనసాగుతుండగా వెలుతురు కూడా మందగించింది. దీంతో మరో 31 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే తొలి రోజును ముగించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), మహ్మద్ సిరాజ్ (0)లు ఉన్నారు.
సహకరించాల్సిందిగా మోదీని కోరాం..
ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.
ఊహించని మలుపులు
హైదరాబాద్ ప్రజాభవన్ బారికేడ్లను కారుతో ఢీకొట్టిన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ స్థానంలో పనిమనిషి పేరును చేర్చారు పంజాగుట్ట పోలీసులు. ఈ నెల 23న అర్ధరాత్రి కారుతో బారికేడ్లు ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో ప్రమాదం చేసిన సోహెల్ ను తప్పించి అతడి ఇంట్లో పని మనిషిని కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు తీసుకెళ్తున్న సందర్భంలో పోలీసుల కళ్ళుగప్పి సోహెల్ పరారైనట్టు చెప్పారు. కాగా, దుబాయ్ నుంచే తన కొడుకును తప్పించేందుకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పోటు కార్మికులకు వేతనాలు రూ.10వేలు పెంచాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతియేటా ఇచ్చే ప్యాకేజీ మరో కోటి రూపాయలకు పెంపు చేశారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు.
కరోనాతో ఇద్దరి మృతి
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషంట్లు మృతి చెందారు. ఆసుపత్రిలో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్సకు చేరారు వారిద్దరు. అనంతరం వారికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో ఒకరికి 60, మరొకరికి 42 సంవత్సరాలు.
శీనన్న థమ్కీ..
ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత బీఆర్ఎస్ కు థమ్కీ ఇచ్చారు. ప్రజాపాలనపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేని శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతు..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేతలు ప్రజల సొమ్మును దోచేశారని..కానీ మీరు దోచిన డబ్బులు మీరు ఇవ్వనక్కరలేదు..దాన్ని ఎలా తీసుకోవాలో మాకు తెలుసని..తిన్న ప్రతీ పైసా కూడా కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రజలకు సేవకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి..అధికారులకు సహకరించాలని కోరారు.
పాస్ పోర్ట్ వెంటనే ఇవ్వండి
తన తల్లికి ఆరోగ్యం బాగాలేని అమెరికా నుంచి ఏపీకి వస్తున్న ఎన్నారై యశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిని అదుపులోకి తీసుకుని అతని పాస్ పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నారు సీఐడీ అధికారులు. దీంతో యశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నారై యశ్ కు వెంటనే పాస్ట్ పోర్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
స్టే ఇవ్వటం కుదరదు..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వ్యూహం సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోరుతు నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసం విచారణ చేపట్టింది. ఈక్రమంలో పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపిస్తు..వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో రూపొందించారని..టిడిపి, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీ ఫేం చేసేలా సినిమా తీశారని..ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారని కాబట్టి ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టును కోరారు. కానీ రిలీజ్ పై స్టే విధించంలేం అని కోర్టు స్పష్టంచేసింది. విచారణను డిసెంబర్ 28కు వాయిదా వేసింది.
మంత్రుల సమీక్షలు
తెలంగాణలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. అధికారికంగా బాధ్యతలు చేపట్టిననాటినుంచి ప్రజాపాలనపై ఫోకస్ పెట్టింది. ఆయా శాఖలపై సంబంధిత మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మంత్రులు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కేసు
నంద్యాల జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదు అయ్యింది.అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి ఫిర్యాదు చేయటంతో పోలీసులు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై 323,354,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా..చల్లా శ్రీలక్ష్మి చల్లా రామకృష్ణారెడ్డి కోడలు అనే విషయం తెలిసిందే.
సింగరేణి సంగ్రామం..
సింగరేణి పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేస్తోంది. దీని కోసం మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఆరు జిల్లాలో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. 39,773మంది కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఆడుదాం ఆంధ్రా..
గుంటూరు జిల్లాలోని నల్లపాడులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జగన్ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా సంబరాలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ అన్నారు.
సీఎంకు షాకిచ్చేలా ఫ్లెక్సీలు..
నల్లపాడులో వైసీపీ నేత పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నల్లపాడుకు సీఎం జగన్ వచ్చిన క్రమంలో వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో ‘ప్రభుత్వ భూముల్ని కాపాడాలి’ అని ముద్రించిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
భక్త జనసంద్రం..
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా శబరిగిరులు భక్తులతో పోటెత్తున్నాయి. దీంతో దర్శనానికి 15 గంటలకుపైగా సమయంపడుతోంది. మార్గ మధ్యలోను.. దేవాలయం వద్ద సరైన సౌకర్యాలు లేవని భక్తులు వాపోతున్నారు.
మద్యం మత్తులో ఎమ్మెల్యే కుమారుడి వీరంగం..
ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు తన కారుతో బీభత్సం సృష్టించాడు. డిసెంబర్ 23 తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ బారికేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. కారులో షకీల్ కుమారుడితో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. TS13ET0777 అనే కారుతో బలంగా ఢీ కొట్టడంతో భారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటన సమయంలో అక్కడే ఉన్న పోలిసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్యూటీలో వున్న ఇన్స్పెక్టర్, ఒక హోమ్ గార్డ్ నీ ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆస్పత్రిలో మంటలు..
హైదరాబాద్ లోని ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది.ఆస్పత్రిలోని నాలుగో ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది.
ముట్టడి
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ఉక్కు పోరాట కమిటీ ముట్టడించింది. జిందాల్ తో ఎంవోయూ రద్దు చేసుకోవాలని కమిటీ డిమాడ్ చేస్తు కార్యాలయాన్ని ముట్టడించింది.
వీడిన ఉత్కంఠ ..
ఫ్రాన్స్ చెర నుంచి భారతీయ ప్రయాణీకులకు విముక్తి లభించింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్ లో నాలుగు రోజులు నిర్బంధంలోఉన్న భారతీయ ప్రయాణీకులు ఇండియాకు చేరారు. ముంబైలో మిమానం ల్యాండైంది. ఇంకా ఫ్రాన్స్ లోనే 25 మంది ఉన్నారు.
‘పగ’మంచు..
దేశవ్యాప్తంగా పొగమంచు అలముకుంది. దీంతో పలు ప్రాంతాల్లో విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హరియాణా, పంజాబ్, యూపీలలో భారీ పొగమంచు అలముకుంది. సెంట్రల్ ఢిల్లీలో 500 మీటర్లకు విజిబులిటీ పడిపోయింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో 14 ఇండిగో విమానాలను దారి మళ్లించారు. 30 డొమెస్టిక్ విమానాలు రద్దయ్యాయి.
వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమలలో 4వ రోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. టోకెన్ లు కలిగిన భక్తులకు మాత్రమే ఆలయ సిబ్బంది దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. సోమవారం 69,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఒక్కరోజు శ్రీవారి ఆదాయం రూ. 4.10 కోట్లు సమకూరింది.
అడవిలో మంటలు..
హిమాచల్ మంచు కొండల్లో కార్చిచ్చు రాజుకుంది. కులులోని పాట్లీకుహల్ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో అటవీ ప్రాంతం తగలబడుతుంది.
నైజీరియాలో కాల్పులు..
మధ్య నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పుల్లో మొత్తం 160 మంది మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో తొలుత 16 మంది మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడంతో మృతుల సంఖ్య పెరిగింది. మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
28న హైదరాబాద్ కు అమిత్ షా..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కార్యాచరణకు బీజేపీ శ్రీకారం చుడుతోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం హైదరాబాద్ కు రానున్నారు. నగరంలో పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొని లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు పాల్గోనున్నారు.
మత్తు పదార్థాలు స్వాధీనం ..
న్యూఇయర్ దగ్గరపడుతున్న సమయంలో హైదరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్‌కుమార్, లింగయ్య గౌడ్ నుంచి 70కేజీల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నర్సింహ కీలక సూత్రధారిగా గుర్తించారు.