Today Headlines : ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల జైలు శిక్ష.. ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

ఆంధ్రప్రదేశ్ కేడర్‭కు చెందిన ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.

ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో 17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సాయంత్రం 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. 41 మంది కార్మికుల్లో ఐదుగురు కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు. మిగిలిన కార్మికులను బయటికి రప్పిస్తున్నారు.
ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల జైలు శిక్ష

ఆంధ్రప్రదేశ్ కేడర్‭కు చెందిన ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది. ఆ ఇద్దరు జే.శ్యామలా రావు, పొలా భాస్కర్. నీరు చెట్టు కార్యక్రమం కింద దాఖలైన పిటిషన్ మీద విచారించిన హైకోర్టు.. వారిద్దరూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని తేల్చి చెప్పుతూ ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆ ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మైకులు బంద్‌
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకే  ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం  4 గంటలకే ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ వైపు నేతలు దృష్టి సారించారు. నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగనుంది. దీంతో నేతల భవితవ్యం తేలనుంది. ప్రచారం ముగియడంతో తెలంగాణలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. ప్రలోభాలపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టనున్నారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఈసీ వార్నింగ్‌..
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

మద్యం షాపులు బంద్..
30వ తేదీన పోలింగ్ కావటంతో జంట నగరాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలు నిలిపివేశారు. బార్లు, పబ్బులు వైన్ షాపులు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సుప్రీం నోటీసులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్కిల్ డెవపల్ మెంట్ కేసులో 17 ఏ పై తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.

రైతుకు లోకేశ్ భరోసా..
వైసీపీ పాలనలో ఆక్వా హాలిడే ప్రటకించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్ తో నిలిపివేసిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు.అమలాపురం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగతున్న క్రమంలో లోకేశ్ ఆక్వా రైతులు, బీసీలతో టీడీపీ యువనేత నారా లోకేశ్ సమావేశమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని..తాము అధికారంలోకి రాగానే రైతులను..ఆక్వారైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సోనియా సందేశం
తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనే పాల్గొనలేకపోయానని..అయినా మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు అంటూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు.తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నానని..దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయాలని తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు.

మత్తు వదలరా..!
అసోంలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.రూ.15 కోట్ల విలువైన మత్తుపదార్థాలు సీజ్‌ చేశారు.

టార్గెట్‌ సిరీస్‌
కాసేపట్లో ఆసీస్‌తో భారత్‌ మూడో టీ20 ప్రారంభం కానుంది. గౌహతిలో జరుగనున్న ఈ మ్యాచ్ లో సిరీసే లక్ష్యంగా టీమ్‌ ఇండియా బరిలోకి దిగనుంది. దీంతో క్రీడాభిమానులు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ మిస్ కావటంతో ఈ సిరిస్ అయినా గెలవాలని అభిమానులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆకలి చావులే..
కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటోంది.. మరి ఇందిరమ్మ రాజ్యం అంత బాగుంటే ఎన్టీఆర్ టీడీపీ ని ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎమర్జన్సీ వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్ కౌంటర్లు జరిగాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆకలి చావులే అని..కాబట్టి ప్రజలు ఆలోంచి ఓటు వేయాలని కోరారు.58ఏళ్లు తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టారని.. వారు అధికారంలోకి వస్తే మరోసారి కష్టాలు తప్పవని కావట్టి కారు గుర్తుకే ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్‌ మళ్లీ వస్తే కష్టాలు తప్పవని అన్నారు.

ఏ క్షణమైనా
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఆపరేషన్ టన్నెల్ తుది దశకు చేరుకుంది. సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తికావచ్చింది. 17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు నిర్వరామంగా కృషి చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకోవటంతో తమ వారి కోసం కార్మికుల కుటుంబ సభ్యులు ఆశగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఆపరేషన్ మూడు రోజుల క్రితమే పూర్తి అవ్వాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో ఆలస్యమైంది. కానీ సొరంగంలో ఉన్న కార్మికులు అంతా క్షేమంగానే ఉన్నారని వారు త్వరలోనే సురక్షితంగా బయటకు వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ చర్యల్ని పర్యవేక్షిస్తున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా కార్మికులు అంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు. దీంతో టన్నెల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కాగా..కార్మికులు బయటకు రాగానే వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు.

రాహుల్‌ అటాక్‌
కేంద్రంలో మోదీని ఓడించాలంటే తెలంగాణలో KCRను దించాలని రాహుల్ గాంధీ ఓటర్లకు సూచించారు. BRSకు బైబై చెప్పే సమయం వచ్చిందని నాంపల్లి ఎన్నికల ప్రచారంలో అన్నారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..ప్రజలే తేల్చుకోవాలన్న ప్రియాంక గాంధీ సూచించారు.

సర్వే పాలిటిక్స్‌.. పొలిటికల్‌ వార్‌
తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని.. పెయిడ్ సర్వేలతో కాంగ్రెస్‌ మోసం చేస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్‌ అన్నారు. నిర్మల్‌ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.

రేవంత్‌ ఫైర్‌
డబుల్‌ బెడ్రూమ్‌ ఇవ్వని కేసీఆర్‌కు ఓటెందుకేయాలి..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును ప్రజలు ఇవ్వాలని కోరారు.

నాదీ బాధ్యత
తెలంగాణ తెచ్చిన KCRకు లోకల్‌.. నాన్‌ లోకల్‌ తేడా ఉంటుందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని కాబట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

విద్యుత్‌ కాంతులు
ఏపీలో 16 సబ్‌స్టేషన్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 3 వేల కోట్లతో సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు.

కాంగ్రెస్‌ విమర్శలు..
ప్రాజెక్టుల పేరుతో వేలాది కోట్లు తెలంగాణ ప్రభుత్వం దోచుకుందని రాహుల్ గాంధీ విమర్శించారు. BRSకు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్‌ వస్తుందని అన్నారు. అంతకుముందు  రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్ లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మాట తెచ్చిన తంట
బీజేపీ నేత కుష్బూ చేసిన వ్యాఖ్య‌లు తమిళనాడులో దుమారం రేపాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెన్నైలో ఆందోళనకు దిగాయి. కుష్బూ ఫ్లెక్సీని చీపుర్ల‌తో కొడుతూ తమ నిరసన తెలిపారు.

గిరిజన దీపోత్సవం ..
తమిళనాడులో వైభవంగా కార్తీక దీపోత్సవం కొనసాగుతోంది. నీలగిరిలో గిరిజనులు అఖండ దీపాలను వెలిగించారు.

షాకిచ్చిన సీఈసీ .. 
కర్ణాటక సర్కార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణలో వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంపై నోటీసులు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు