Today Headlines: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్

డ్రగ్స్ అమ్మబోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో పాటు అది కొనేందుకు వచ్చిన అర్జున్ (25), దేవేందర్ (23, సాఫ్ట్ వేర్ ఉద్యోగి) ను ట్రాప్ చేసి ముగ్గురినీ ఒకేసారి పట్టుకున్నారు పోలీసులు.

Today Headlines in Telugu at 11PM

డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి 7.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్.ఓ.టి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడులు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దగ్గర డ్రగ్స్ ఉండగా.. అది కొనేందుకు వచ్చిన అర్జున్ (25), దేవేందర్ (23, సాఫ్ట్ వేర్ ఉద్యోగి) ను ట్రాప్ చేసి ముగ్గురినీ ఒకేసారి పట్టుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు
గాలిస్తున్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

కమ్మని కలలకు ఆహ్వానం పలుకుతూ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. 2023ను గతంలో కలిపేస్తూ 2024లో తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రజలు 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు.

రాజకీయ చదరంగం మారబోతుంది..
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని పరిస్థితులపై చర్చించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తర్వాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌ చేరతారని అనుకుంటున్నానని చెప్పారు. రాజకీయ చదరంగం మారబోతుందని అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

బాంబు బెదిరింపు..
నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబై సంసిద్ధమ‌వుతుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తి నుంచి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జ‌రుగుతాయ‌ని బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన ముంబై పోలీసులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. నగ‌రమంత‌టా విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టారు. కాల‌ర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌ధ్యంలో ముంబైలో బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టారు.

ముగ్గురు కెప్టెన్లు..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీ‌లంక జ‌ట్టు వైఫ‌ల్యంతో ఆ దేశ‌ క్రికెట్ బోర్డు మేల్కొంది. స్వ‌దేశంలో జింబాబ్వే తో వ‌న్డే, టీ20 సిరీస్ కోసం ముగ్గురు కెప్టెన్ల‌ను నియ‌మించింది. వన్డేల్లో శ్రీలంక కెప్టెన్‌గా కుశాల్ మెండిస్, టీ20లకు వనిందు హసరంగ సారథ్యం వహించనున్నారు. దిముత్ కరుణరత్నే టెస్టు జట్టుకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను కలిగి ఉండటం శ్రీలంకకు ఇదే తొలిసారి.

డ్రగ్స్ ముఠా అరెస్ట్..
నగరంలోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఇయర్ వేడుకలో్ల విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్, రూ. 10వేలు, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీన చేసుకున్నారు.

పెరిగిన కొవిడ్ కేసులు..
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్‌.. జేఎన్‌.1 (JN.1) సబ్‌వేరియంట్‌ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, తాజా కేసులతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,309కి చేరింది. అదేవిధంగా కొత్తగా మరో ముగ్గురు మరణించారు. వారంతా కేరళ, కర్ణాటక, బీహార్‌కు చెందినవారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నగరంలో ఆంక్షలు ..
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇవాళ రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5గంటల వరకు నగరంలో పలు ఆంక్షలు విధించారు. రాత్రి నుంచి ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ ప్రెస్ వే మూసివేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. శిల్ప లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, షేక్ పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరంమాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లతో పాటు దుర్గం చెరువు తీగల వంతెన మూసివేయనున్నారు.

అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లు..
నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వివిధ కారిడార్ లలో ఆఖరి సర్వీసు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారు జామున ఒంటిగంటకు చివరి స్టేషన్ కు చేరుకుంటుందని తెలిపారు.

గడువు పొడిగింపు..
రేషన్ కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80శాతం పూర్తయింది.

తిరుమల సమాచారం..
తిరుమలలో 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. రేపు అర్థరాత్రితో వైకుంఠ ద్వార దర్శనం పూర్తవుతుంది. జనవరి 2 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదిలాఉంటే శనివారం శ్రీవారిని 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు లభించింది.

కౌంట్ డౌన్ ..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024 నూతన సంవత్సరం మొదటి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 వాహక నౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

ట్రాఫిక్ ఆంక్షలు..
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్దీకరణకు 31 రాత్రి నుంచి జనవరి 1 అర్థరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ (ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి 1వ తేదీ రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు (పీఎన్ఆర్ మార్గ్), అప్పర్ ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.