Today Headlines: జాగ్రత్త.. కాపు పెద్దలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.

Today Headlines in Telugu at 11PM

వైసీపీ వలలో చిక్కుకోవద్దు..
జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాను అని పవన్ చెప్పారు. నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి.. కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పవన్ కల్యాణ్ అన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విన్నపం చేశారు పవన్ కల్యాణ్.


ఇప్పటికీ రాలేదు: గంగుల

తెలంగాణకు సీఎంగా కేసీఆర్ లేకపోవడంతో ఈ నెల రోజులు ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు, రుణమాఫీ ఇప్పటికీ రాలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.

తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

కానిస్టేబుళ్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ కానిస్టేబుళ్ల నియామకాలపై ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో, 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.

అందుకే షర్మిల కాంగ్రెస్‌లోకి..  
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకుని సీఎం జగన్‌ని భయపెట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్లే, ఏపీలో జగన్ సర్కారు పోవాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.

లోటస్‌పాండ్‌కు జగన్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని నివాసానికి వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్‌పాండ్‌ నివాసంలోకి అడుగుపెట్టారు. జగన్ వెళ్లిన సమయంలో వైఎస్ విజయమ్మ అక్కడే ఉన్నారు.

పరామర్శ ..
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంకు వెళ్లిన జగన్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగన్, కేసీఆర్ మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. ఇరువురి నేతల మధ్య ఏపీ, తెలంగాణ తాజా రాజకీయాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.

కాంగ్రెస్ లో చేరిన షర్మిల..
వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.  వైఎస్ఆర్టీపీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా సోనియాగాంధీని కలిశారు.

తిరుమల సమాచారం..
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 65,514 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 20,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు.

భవానీ దీక్షల విరమణ..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై  రెండోరోజు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాలినడకన భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటున్నారు.

బండికి కీలక పదవి..
భారతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కరీంనగర్ ఎంపీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు మొత్తం ఏడు పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త ఇన్ఛార్జిలను నియమిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహాల ప్రదాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో యువమోర్చా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, మహిళా మోర్చా నాయకురాలిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జీగా తరుణ్ చుగ్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్, ఎస్టీ మోర్చా ఇన్‌చార్జీగా రాధా మోహన్ దాస్, ఓబీసీ మోర్చా అధిపతిగా వినోద్ తావడీ, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జీగా దుష్యంత్ కుమార్ లను జేపీ నడ్డా నియమించారు.

8వ తేదీ వరకు అవకాశం..
మార్చి 18వ తేదీ నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 8వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఫీజు చెల్లించవచ్చని, ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

17నాటికి పూర్తిచేయండి..
ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని ఆదేశించారు.