గల్లీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారా? గెలుపుపై గులాబీ దళం ధీమా!

  • Publish Date - December 2, 2020 / 08:43 AM IST

Party leaders predict majority of Votes in GHMC elections : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ సరళిని బట్టి పరిశీలిస్తే.. మరోసారి అధికార పక్షానికే ప్రజలు మొగ్గుచూపినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ నగర ప్రజలు పట్టించుకోలేదని చెబుతున్నారు. అధికారపక్షంపై ప్రతిపక్షాలు ఎంతగా విష ప్రచారం చేసినా ప్రజలు తమ ఓటు ద్వారా సరైన సమాధానం చెప్పి ఉంటారని అంటున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం కేసీఆర్‌ ‘సేవ్‌ హైదరాబాద్‌’ పిలుపును అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని అంటున్నారు.



పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ప్రచారం కూడా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. ఓటింగ్​ శాతం తగ్గినప్పటికీ తమకే లాభం అని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలు పోలింగ్‌లో పాల్గొన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే తమకు కలిసివచ్చే అంశమని అంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్‌లో పాల్గొన్నారని, మెజార్టీ సీట్లు తమకే వస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



https://10tv.in/petition-in-the-high-court-against-ghmc-ex-officio-members/
పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, సాధారణ కార్యకర్తలు వరకు అందరూ కృషి చేశారని, ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించారని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు సృష్టించిన భయాందోళనల్లో నగర ప్రజలెవరూ ప్రలోభాలకు లోనుకాలేదని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రత్యేకతను చాటుకున్న టీఆర్‌ఎస్‌ వెంటే హైదరాబాదీలు ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



బీజేపీ సృష్టించిన గందరగోళంలో ఓటర్లు పడలేదని, తెలివిగా వ్యవహరించి అధికారపక్షానికే పట్టం కడతారని అంటున్నారు. ఓటేసిన హైదరాబాదీల్లో అత్యధికులు తమకే అధికారాన్ని అప్పగిస్తారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ మహానగరాన్ని తమ పార్టీ రూ.67వేల కోట్లతో తీర్చిదిద్దిందని, అందుకే ఓటర్లు కూడా తమ అభివృద్ధి పనులను గుర్తించారని చెబుతున్నారు.



టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు చేసిన సర్జికల్‌ స్ట్రయిక్స్ వంటి వ్యాఖ్యలను ఓటర్లు తమ ఓటుతో తిప్పికొట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.



వరద బాధితులకు సాయాన్ని అందించడంలో అసలు వెనక్కు తగ్గేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయటంతో పాటు ఇతర హామీలను ఓటర్లు మనస్ఫూర్తిగా స్వాగతించారని అంటున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ అధికార పీఠాన్ని మరోసారి గల్లీ పార్టీ గులాబీనే దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు