Bandi Sanjay's sensational allegations against the TRS government on the popular front of India case
PFI Case : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కుట్ర చేస్తోందని..టీఆర్ఎస్,ఎంఐఎం కలిసి కుట్ర చేస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2040నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు PFI కుట్ర చేస్తోందని..పీఎఫ్ఐ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు బండి. పీఎఫ్ఐను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఉగ్రవాద కార్యక్రమాలకు పీఎఫ్ఐ అడ్డాగా మారిందన్నారు.
కాగా..ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)పై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) నలుగుర్ని అరెస్టు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిని రిమాండుకు తరలించింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్‌ఐపై నిజామాబాద్‌లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తుకు ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు.
రెండు రోజుల క్రితం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. బోధన్‌కు చెందిన సయ్యద్ సమీర్, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో వారిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.