సుమారు 45 రోజులు అంటే నెలన్నర రోజుల తర్వాత ఇటీవలే పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ లాక్ డౌన్ లో కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇచ్చాయి. సోమవారం(మే 4, 2020) నుంచి లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లు మద్యం లేక విలవిలలాడిన మందుబాబులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. పీకల దాకా తాగి ఊగుతున్నారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. వైన్స్ షాపుల ముందు క్యూలు కట్టారు. మండుటెండులనూ లెక్క చెయ్యడం లేదు. గంటల తరబడి నిలబడి మరీ మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు.
తొలి రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు:
మందుబాబుల పుణ్యమా అని పలు రాష్ట్రాల్లో తొలి రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. వందల కోట్ల రూపాయల్లో సేల్స్ జరిగాయి. ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఖజానా ఖాళీ అయ్యింది. ఈ పరిస్థితుల్లో మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చూసి ప్రభుత్వాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
కర్నాటకలో 2రోజుల్లో రూ.242 కోట్ల మద్యం విక్రయాలు:
మద్యం అమ్మకాలు భారీగా జరిగిన రాష్ట్రాల విషయానికి వస్తే, కర్నాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కర్నాటక రాష్ట్రంలో తొలి రోజే(సోమవారం, మే 4) రూ.45కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం(మే 5,2020) మరింత జోరు పెరిగింది. మందుబాబులు మరింత రెచ్చిపోయారు. రెండో రోజు ఏకంగా రూ.197 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2019లో డిసెంబర్ 28న రూ.170 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కర్నాటక రాష్ట్రంలో ఇప్పటివరకు అదే రికార్డ్. ఆ రికార్డ్ ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయింది.
యూపీలో ఒక రోజే రూ.100 కోట్ల లిక్కర్ సేల్స్:
కర్నాటక తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ లో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ అయ్యాయి. రాష్ట్రంలో ఒక రోజులోనే వంద కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ కరోనా ఫీజు కింద 70శాతం మేర ధరలు పెంచినా మద్యం కొనేందుకు మందుబాబులు పోటీలు పడ్డారు. మహారాష్ట్రలో రెండో రోజు(మే 5,2020) రూ.62 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
తొలిరోజు ఏపీలో రూ.68కోట్లు, తెలంగాణలో రూ.90కోట్ల మద్యం విక్రయాలు:
మద్యం ఎక్కువగా తాగేవారు ఉన్న రాష్ట్రం కేరళ. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇవ్వలేదు. మే 17వ తేదీ వరకు అంటే లాక్ డౌన్ అమల్లో ఉన్నంత వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైన్స్ షాపులు ఓపెన్ చేస్తే భౌతిక దూరం నిర్వహణ అసాధ్యమవుతుందన్నారు. కరోనా కేసులు పెరిగేందుకు అస్కారం ఉందని ప్రభుత్వం చెప్పింది.
ఇక ఏపీ, తెలంగాణలోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏకంగా 75శాతం మేర మద్యం ధరలు పెంచగా, తెలంగాణ ప్రభుత్వం 16శాతం మేర ధరలు పెంచింది. అయినా మందుబాబులు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఎగబడి మరీ మందుబాటిళ్లు కొనేస్తున్నారు. తొలి రోజు(మే 4,2020) ఏపీలో రూ.68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. తెలంగాణలో తొలిరోజు(మే 6,2020) రికార్డు స్థాయిలో రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read | 2లక్షల మద్యం బాటిళ్లు మాయం, సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం