Unmarried People Visiting The Srinivasa Mangapuram Temple
TTD Temple: నేటి యువత ప్రభుత్వం విధించిన పెళ్లి వయసు మించి పదేళ్లు గడిచిపోతున్నా పెళ్లి ఊసెత్తడం లేదు. మూడు పదుల వయసు మీదపడినా ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు.. పెళ్ళికి తొందరేముందని సింపుల్ గా చెప్పేస్తున్నారు. మరికొందరు చిన్నదో పెద్దదో ఏదోకటి ఉద్యోగం ఉంది పెళ్లి చేసుకుంటే ఒక పనైపోతుందని తొందర పడినా వారిలో కొందరికి వధువు సెట్ కావడం లేదు. వీటికి తోడు జాతకాలు కుదరలేదని.. యువతికో, యువకుడికో ఏదో జాతక బలం తక్కువగా ఉందని కూడా పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. మొత్తంగా నేటి సమాజంలో పెళ్లి వయసు ఏడాదికి ఏడాది పెరిగిపోతూనే ఉంది. ఉరుకుల పరుగుల జీవితం.. ఏదో సాధించాలనే తపనలో మునిగిపోయిన యువత కొందరు అసలు చివరికి పెళ్లి కాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు.
ఇలాంటి వారు ఒక్కసారి తిరుమల వెళ్లి శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనం చేసుకుంటే పెళ్లి ఘడియలు వరిస్తాయని ప్రజలలో పెద్దఎత్తున ఒక నమ్మకం ఉంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలిసినదే. తిరుమలలో ఆ వెంకన్న ప్రముఖ ఆలయం మాత్రమే కాదు.. శ్రీనివాసమంగాపురం ఆలయం కూడా చాలా ప్రాముఖ్యత, ప్రసిద్ధి గలదే. ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం సాక్షాత్తూ స్వామి వారు వివాహం అనంతరం అమ్మవారితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారని.. అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తారు.
16వ శతాబ్ద కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా అక్కడి శాసనాలు చెప్తుండగా అప్పటి నుండి జాతకదోషంతో వివాహ అడ్డంకులు ఏర్పడిన కోటానుకోట్ల మంది దోష నివారణ కోసం ఇక్కడ పూజలు నిర్వహించారు. జాతక దోషం కలిగిన యువతీ యువకులు వారి తల్లిదండ్రులతో శ్రీనివాస మంగాపురం ఆలయానికి వచ్చి స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తుంటారు. కల్యాణం అనంతరం అర్చకులు యువతీ, యువకులకు చేతికి ఒక కంకణం ధరింపజేస్తారు. ఈ కల్యాణోత్సవం జరిపించిన యువకులకు త్వరగా వివాహాలు జరుగుతున్నాయని అక్కడి పండితులు చెప్తారు. అందుకోసమే అవివాహితులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడి వివాహం నారాయణవనంలో జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరగా.. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వరకు కొండ ఎక్కకూడదని చెప్తారు. పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో స్వామి వారు సతీసమేతంగా అగస్త్య ఆశ్రమంలోనే ఆరునెలలపాటు విడిది చేస్తారు. స్వామి వారి ఆరు మాసాల విడిది అనంతరం తిరుమలకు వెళ్లే ముందు భక్తులకు రెండు వరాలను ప్రసాదించి వెళ్లారట. తన దర్శనార్థం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలోని దర్శనం చేసుకోవచ్చని, ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని కల్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహం కాని వారు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని పండితులు సూచిస్తుండగా.. వారికి వివాహలు జరగడంతో విశ్వాసం కూడా పెరుగుతూ వస్తుంది.