ఒకే అమ్మాయిని ప్రేమించిన నలుగురు అబ్బాయిలు..నలుగురు ఓకే అన్న అమ్మాయి : లక్కీ డ్రా తీసి ఒకరిని సెలెక్ట్ చేసిన పెద్దలు

UP four lovers one women love..lottery here lucky guy : ఓ యువరాణికి పెళ్లి చేయాలంటే రాజు వివిధ దేశాలకు చెందిన రాజులకు ఆహ్వానం పంపించి స్వయంవరం ప్రకటించి వివాహం చేసేవారట పూర్వం. పురాణాల్లోనూ, పురాతన కాలంలోనూ ఇటువంటి వివాహాలు జరిగేవని విన్నాం. కానీ.. ఈ కంప్యూటర్ కాలంలో ఇంచుమించు అటువంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది. నలుగురు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఆ నలుగురుని తాను కూడా ప్రేమిస్తున్నానని చెప్పిందా అమ్మాయి. దీంతో ఆమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో తెలీక అటు అమ్మాయి తరపు బంధువులతో పాటు గ్రామ పెద్దలు తలలు పట్టుకున్నారు.ఈ విచిత్ర ఘటన రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది..

ఈ విచిత్ర చరుర్ముఖ ప్రేమాయణం గురించి చెప్పాలంటే..రాంపూర్ జిల్లాలోని అజీమ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో నలుగురు అబ్బాయిలు తాండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ‘ఎవర్నీ బాధ పెట్టకూడదని అనుకుందో ఏమోగానీ..ఆ నలుగురిలో ఎవ్వరినీ కాదనలేదు. నలుగురినీ ప్రేమించింది. ఈ ‘చతుర్ముఖ ప్రేమాయణం’ కొంతకాలం సాగింది. కానీ ఆ అమ్మాయి నాదంటే నాదని నలుగురు గొడవకు దిగారు. నా ప్రేమ గొప్పదంటే నా ప్రేమ గొప్పదని వాదులాడుకున్నారు.

అలా..ఆ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు కలిసి ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచిఉంచారు. ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఏం కావాలో అన్నీ అమర్చిపెట్టారు. కూతురు కనపించకపోవటంతో అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి సిద్ధపడ్డాడు. అలా రెండు రోజులకు ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ గ్రామం మొత్తానికి తెలిసింది. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆ నలుగురు ప్రేమికులతో పాటు ఆ అమ్మాయిని కూడా ఊళ్లోకి తీసుకొచ్చారు.

ఈ విషయం చుట్టు పక్కల ఊళ్లకు తెలిస్తే..అమ్మాయి అల్లరైపోతుంది సావధానంగా కూర్చుని మాట్లాడుకుందామని తండ్రికి నచ్చ చెప్పారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. అమ్మాయిని పిలిచి..‘‘ఆ నలుగురిలో ఎవరు నీకు ఇష్టమో చెప్పు..అతనికే ఇచ్చి పెళ్లిచేస్తాం’’ అని. కానీ ఆ అమ్మాయి కూడా ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘నలుగురు నాకు ఇష్టమే..’’అని చెప్పింది.

నలుగురు అబ్బాయిలను ఒకచోట చేర్చి వారికి నచ్చచెప్పారు. మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే.. అతనికే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీనిని నలుగురూ ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని నేనే చేసుకుంటానంటే కాదు నేనే చేసుకుంటానని మరోసారి వాదులాటలు మొదలు పెట్టారు. దీంతో ఏం చేయాలో తెలీక..అమ్మాయి తండ్రితో పాటు గ్రామ పెద్దలంతా తల పట్టుకున్నారు.

ఇలా ఈ చతుర్మఖ ప్రేమాయణం స్టోరీ మూడు రోజులు గడిచింది. ఎడతెగని చర్చలు..నచ్చచెప్పటాలు. బుజ్జగించటాలు.బెదిరించటాలతో మూడు రోజులు గడిచిపోయాయి. సమస్య ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చి ఆగింది. దీంతో ఇక లాభం లేదని..గ్రామ పెద్దలు నాలుగవ రోజు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఎలాగోలా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు.

నలుగురు అబ్బాయిల్ని కూర్చోపెట్టి..’’మీ పేర్లు చిట్టీల్లో రాసి ‘లక్కీ డ్రా’ తీస్తాం..దాంట్లో ఎవరి పేరు వస్తుందో ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తాం’’ అని కరాఖండీగా చెప్పేశారు. దీంట్లో భాగంగా అమ్మాయి తండ్రీ, బంధువులతో పాటు గ్రామ పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పుల్లో నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. దీంతో మిగితా ముగ్గురు అబ్బాయిలు ఇక ఈ జన్మకు ఇంతే ననుకున్నారో ఏమోగానీ..మిన్నకుండిపోయారు..ఇదేదో సినిమా స్టోరీలాగా ఉన్నాగానీ నిజంగానే జరిగింది. ఈరోజుల్లో కూడా ఇలా జరుగుతుందా? అనేలా ఉందికదూ..

కాగా..ప్రేమించిన అమ్మాయి తమకు దక్కకపోతే దాడి చేయటం..కత్తులతో పొడచేయటం.గొంతులు కోసేయటం, లేదా చంపేయటం వంటి పలు ఘాతుకాలు జరుగుతున్న ఈరోజుల్లో గ్రామ పెద్దల నిర్ణయానికి కట్టుబడిన ఆ యువకుల తీరును అభినందించాల్సిందే..