Uttarakhand Elections : యమకేశ్వర్‌ ప్రత్యేకత..20 ఏళ్లుగా ‘ఆమె’కే పట్టం కడుతున్న ఓటర్లు..

ఉత్తరాఖండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని యమకేశ్వర్‌ నియోజక వర్గం ఏర్పడినప్పటినుంచి మహిళకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఈసారి కూడా ఓటర్లు మహిళనే గెలిపిస్తారో లేదో చూడాలి.

Uttarakhand Elections

Uttarakhand Elections 2022 : హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా అలరారే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 2006 దరకు ఉత్తరాంచల్ గా పిలవడే ఉత్తరాఖండ్ ను దేవ భూమి అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ లో ఓటర్లు మహిళలకే పట్టం కడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మహిళకే ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారు.

ఉత్తరాఖండ్‌ 2000 నవంబర్ 9న భారతదేశపు 27వ రాష్ట్రంగా ఏర్పాడింది. 2000లో ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికలు 2002 ఫిబ్రవరి 14న జరిగాయి. తొలి ఎన్నికల నుంచి గడిచిన 2017 ఎన్నికల వరకూ నాలుగు సార్లు పౌఢి గఢ్వాల్‌ జిల్లాలోని యమకేశ్వర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మహిళనే గెలిపించారు. నియోజకవర్గంలో సుమారు 90 వేల ఓట్లు ఉండగా వీరిలో 40 వేలకు పైగా మహిళా ఓటర్లే కావటం విశేషం.

రాష్ట్రం ఏర్పడ్డాక 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయ భరద్వాజ్‌ గెలుపొందారు. మొదటిసారి ఆమె గెలిచినపుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైయ్యారు విజయ భరద్వాజ్‌. 2007లో గెలుపొంది మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో యమకేశ్వర్‌ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్‌ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి రేణు బిస్త్‌పై 8,982 ఓట్ల తేడాతో రీతూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరో ఆరుగురు పురుష అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం.

2022లో కూడా బీజేపీ తమ అభ్యర్థిగా రేణు బిస్త్‌ను ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుత అసెంబ్లీలో రీతూ ఖండూరితోపాటు మరో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. మరి మరోసారి ఓటర్లు మహిళలకే పట్టం కడతారో లేదో ఫలితాలు వెలువడే వారు వేచి చూడాల్సిందే.

కాగా.. ఉత్తరాఖండ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి బీజేపీ వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. పోలింగ్ కు మరో రెండు వారాలే ఉండడంతో మెగా క్యాంపెయిన్ కు ప్లాన్ చేసింది. దీంట్లో భాగంగా మరోసారి ప్రధాని మోడీని రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. మోడీ ప్రచారం విషయంపై ఉత్తరాఖండ్ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ‘ఉత్తరాఖండ్ లో క్యాంపెయిన్ చేసేందుకు మోడీ అంగీకరించారు కూడా.

2017 ఎన్నికల్లో మోడీ చరిష్మాతోనే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ వేవ్, కేంద్ర నిర్ణయాల ఎఫెక్ట్ తో 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ59 స్థానాల్లో గెలిచి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సారి కూడా భారీ మెజార్టీ లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళ్తోంది. కాగా గత నవంబర్​లో మోడీ ఉత్తరాఖండ్ లో  పర్యటించారు.  రూ. 409 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డిసెంబర్ 4, 30 తేదీల్లోనూ పలు శంకుస్థాపనలు చేశారు.

జాతీయ వేదికలపై సైతం ఉత్తరాఖండ్​కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు సార్లు కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ బ్రహ్మకమలం బొమ్మ ఉన్న ఉత్తరాఖండ్ టోపీని ధరించి రాజ్ పథ్​లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కేదార్ నాథ్ వెళ్లినప్పుడు కూడా మోడీ ఇదే టోపీని ధరిస్తుంటారు. బీజేపీ మరోసారి విజయం ఖాయం అన్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.