రైల్వే ట్రాక్ పై జనాల షికార్లు..120 కిమీ వేగంతో దూసుకుపోయిన ట్రైన్..

Train On Trial Run Crushes 4 People dead : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్-లక్సర్ మధ్య గురువారం (జనవరి 7,2021) సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్వహించిన హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ లో విషాదం చోటుచేసుకుంది.

గంటకు 100- 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుండగా..హరిద్వార్-జమాల్‌పుర్కాల మధ్య రైలు కింద పడి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదం పట్ల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించారు. నార్తరన్ రైల్వేస్ డివిజనల్ రీజనల్ మేనేజర్ తరుణ్ ప్రకాశ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఇటీవలే విస్తరించిన ట్రాక్‌లపై ఢిల్లీ నుంచి తెప్పించిన హైస్పీడ్ రైలుతో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈక్రమంలో హరిద్వార్-జమాల్‌పుర్కాల మధ్య స్థానికులు రైల్వే ట్రాక్ లపై ఆడుకుంటు షికార్లు చేస్తున్నారు. అదే సమయంలో 100-120 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ట్రైన్ వారిమీదుగా దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న హరిద్వారా రూరల్ ఎమ్మెల్యే స్వామి యతీశ్వరానంద్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్‌పై షికారు చేస్తున్న నలుగురు వ్యక్తులు రైలు వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ దుర్ఘఘటన జరిగిందని తెలిపారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయమని అన్నారు.