కరోనాపై ఏం చేద్దాం : హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారా

  • Publish Date - July 2, 2020 / 07:37 AM IST

హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కొందరు లాక్ డౌన్ కు అనుకూలంగా ఉండగా..మరికొందరు వద్దని వినతులు చేశారని తెలుస్తోంది. రాష్ట్ర సీఎస్ ఇచ్చే నివేదికపై సీఎం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం తెలుస్తోంది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే…వ్యక్తిగత ఆదాయాలతో పాటు…రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుందని, రవాణా, నిత్యావసరాల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయని మరికొందరు వెల్లడిస్తున్నారు.

లాక్ డౌన్ విధించడం కంటే..ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్..అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వైద్య పరమైన సన్నద్ధత, వివిధ శాఖల వారీగా ఆదాయాలు ఇతరత్రా వాటిపై ఆరా తీస్తున్నారు. దీని ప్రకారం ఓ నివేదిక తయారు చేసి సీఎం కేసీఆర్ కు ఇవ్వనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహణ, లాక్ డౌన్ విధించాలా వద్దా ? అనే దానిపై 2020, జులై 02వ తేదీ గురువారం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

Read:ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా ?… విద్యాశాఖను ప్రశ్నించిన హైకోర్టు