Yaas Cyclone Update
Yaas Cyclone Update: వరస తుఫానులు మన దేశాన్ని వణికిస్తున్నాయి. ఒకవైపు కరోనా హడలెత్తిస్తుండగానే పుట్టుకొస్తున్న తుఫానులు ప్రజలకి సవాళ్లు విసురుతున్నాయి. తౌటే తుఫాన్ తీరం దాటి గంటలు గడవకముందే మరో తుఫాన్ ఏర్పడనుందనే వాతావరణ అధికారుల ప్రకటనలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫానుపై ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ సమాచార సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా.. వాయుగుండం నుండి తుఫానుగా మారిన యాస్ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న యాస్ తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశా తీరంవైపు దూసుకొస్తున్నదని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో యాస్ ఉత్తర- వాయవ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపగా NDRF బృందాలను అప్రమత్తం చేసినట్లుగా ఆయన చెప్పారు.
భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం మే 26న యాస్ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తాము మరో 20 NDRF బృందాలను ఒడిశా తీరానికి పంపించామని ప్రధాన్ చెప్పారు. యాస్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సూచించగా లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించింది. ఇప్పటికే ఒడిశా, బంగాల్ రాష్ట్రాలు అప్రమత్తమవగా.. రెండు తెలుగు రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.