తెరుచుకున్న యమునోత్రి ఆలయం..ఆన్​లైన్​లోనే దర్శనం

Yamunotri Shrine

Yamunotri Shrine హిందువులు పవిత్రంగా భావించే ‘చార్​ధామ్’​ దేవాలయాల్లో ఒకటైన య‌మునోత్రి ఆల‌యాన్ని ఇవాళ తెరిచారు. అక్ష‌య త్రితియ సంద‌ర్భంగా.. క‌ర్కాట‌క ల‌ఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో మ‌ధ్యాహ్నం 12.15 నిమిషాల‌కు పూజారులు, అధికారులతో సహా 25 మంది సమక్షంలో ఆలయ ద్వారాలు తెరిచినట్లు యమునోత్రి ఆలయ తీర్థ్ పురోహిత్ పవన్ ఉనియల్ తెలిపారు. మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోడీ తరఫున నిర్వహించారు పూజారులు. స‌ర్వ జ‌గ‌త్తును రోగాల నుంచి విముక్తి చేయాల‌ని పురోహితులు ఆ దేవ‌త‌ను ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు.

చార్‌ధామ్ యాత్ర‌లో య‌మునోత్రి ఆల‌యాన్ని ముందు తెరుస్తారు. శ‌నివారం గంగోత్రి, సోమ‌వారం కేదార్‌నాథ్‌, మంగ‌ళ‌వారం బ‌ద్రీనాథ్ ఆల‌యాల‌ను కూడా తెర‌వ‌నున్నారు. కానీ భ‌క్తుల‌కు మాత్రం ప్ర‌వేశం ఉండ‌దు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా చార్‌ధామ్ యాత్ర‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

ప్రతి ఏటా శీతాకాలంలో ఆరునెలల పాటు మూసి ఉండే చార్​ధామ్ ఆలయాలు భక్తుల సందర్శనార్థం వేసవికాలంలో తెరుచుకుంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది, ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో గతేడాది నుంచి ఆన్​లైన్​ పోర్టల్స్​ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చార్​ధామ్ దేవాలయాల్లో భాగమైన ​గంగోత్రి పోర్టల్​ మే 15(శనివారం) ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. కేదార్​నాథ్​ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.