Bones
Bones : 30 ఏళ్ల తర్వాత శరీరంలో ఎముకల వృద్ధి అన్నది ఆశించినంత స్థాయిలో ఉండదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకల క్షీణత సమస్య అధికంగా ఉంటుంది. ఈ వయస్సులో ఎముకలు గుల్లబారిపోయి పటుత్వాన్ని కోల్పోతాయి. ఈ సమస్య మగవారితో పోల్చితే ఆడవారిలోనే అధికంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాల్షియం లభించే పదార్ధాలను ఆహారంగా తీసుకోకపోవటం, విటమిన్ డి శరీరానికి తగినంతగా అందకపోవటం, రోజు వారి వ్యాయామాలకు దూరం కావటం వంటి కారణాలు ఎముకల క్షీణతకు మూలకారణంగా చెప్పవచ్చు.
పీరియడ్స్ ఆగిపోవటం, మోనోపాజ్ దశలో ఈ స్ట్రోజన్ హార్మోన్ మోతాదులు పడిపోతాయి. దీని వల్ల సైతం ఎముకలు త్వరగా క్షీణతకు లోనవుతాయి. వయస్సు పైబడే కొద్ది చాలా మందిలో ఎముకలు గుల్లబారటం, శక్తి కోల్పోవటం, ధృఢత్వం లేకపోవటం, ఎముకలు విరిగిపోవటం వంటివి చోటు చేసుకుంటాయి. దీనిని అస్టియోపోరోసిస్ సమస్యగా పిలుస్తారు. ఈ పరిస్ధితిని ముందుగా అంచనా వేయటం ద్వారా సమస్యను రాకుండా నివారించుకోవచ్చు.
మనిషి ఎత్తు, బరువులు సైతం ఎముకలు క్షీణతను నిర్ధేశిస్తాయి. ఉండాల్సిన బరువు కన్నా ఎక్కవగా ఉన్నా , తక్కువగా ఉన్నా ఎముకల సమస్య ఏర్పడవచ్చు. మద్యం, సిగరెట్లు తాగటం అలవాటు ఉన్నవారిలో ఎముకలు గుల్లబారే అవకాశాలు అధికంగా ఉంటాయి. వివిధ రకాల రోగాలకు చికిత్స నిమిత్తం మందులు వాడే వారిలో సైతం ఈ ముప్పు పొంచి ఉంటుంది. ఎముకలు గుల్లబారే స్వభావం వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎముకలు ధృడంగా ఉండాలంటే రోజువారిగా వ్యాయమాలు చేయటాన్ని అలవర్చుకోవాలి. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఎముకల ఆరోగ్యం కోసం అవసరమైన మేర క్యాల్షియంతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. రోజు వారిగా అవసరమైన డి విటమిన్ అందేలా కొంతసేపు ఎండలో గడపాలి. ప్రొటీన్ ఆహారాలను తీసుకోవటం మంచిది. మద్యసేవించటం, పొగ వంటి అలవాట్లను మానుకోవటం మంచిది.
అంతేకాకుండా వయస్సు పైబడిన వారు ఏడాదికి ఒకసారైనా ఎముక సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్ వంటి పరీక్షలను చేయించుకోవాలి. దీని వల్ల సమస్య ఉన్నట్లైతే వెంటనే చికిత్స పొందేందుకు వీలుకలుగుతుంది. బత్తాయి, నారింజ, జామ, రేగు, పుచ్చ, బొప్పాయి, ఉసిరి, బ్రకోలి, చిక్కుళ్లు, దోసకాయ, వెల్లుల్లి, ఎండుద్రాక్ష వంటివాటిని ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.