వెళ్లొద్దమా : పెద్దగట్టు జాతర వచ్చేసింది

  • Publish Date - February 20, 2019 / 07:10 AM IST

తెలంగాణ రాష్ట్రంలో గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన జాతర లింగమంతుల స్వామి జాతర. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా ఈ జాతరకు పేరుంది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు. అదే సూర్యాపేట జిల్లాకేంద్రానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లాపురం గుట్టపై జరిగే లింగమంతులస్వామి జాతర. దీనిని పెద్దగట్టు, గొల్లగట్టు, లింగవంతులస్వామి, కొండగట్టు జాతరగా కూడా పిలుస్తుంటారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వల్లాపురం గుట్టపై లింగ మంతుల స్వామి ఆలయం ఉంది. ఆ ప్రాంతంలోని పెద్ద పులుల భారీ నుంచి ఆవులను లింగ మంతుల స్వామి రక్షించేవాడని నానుడి. దీంతో ఆ ప్రాంత యాదవులకు ఆయనే ఆరాధ్యదైవంగా మారాడు. ఎంత బోయిన, మున్నా వంశస్థులు కలిసి ఈ జాతర నిర్వహించేవారు. ఈ నెలలో జరుగనున్న గొల్లగట్టు జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఫిబ్రవరి 24 నుంచి 5రోజుల పాటు..
పూజలు చేయడానికి, కథలు చెప్పడానికి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన తండా వంశస్థులు 10మందిని పూజారులుగా ఏర్పాటు చేసుకున్నారు. వీరి వద్దనే 33 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూలవిరాట్‌ విగ్రహాలు అయిన లింగమంతులు, పాలచర్లయ్య, సౌమేశ్వరమ్మ, గంగ విగ్రహాలు మాత్రం గుడిలోనే ఉంటాయి. ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు చీకటాయపాలెం నుంచి ఉత్సవవిగ్రహాలు తీసుకెళ్లి జాతర అనంతరం తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇదే క్రమంలో ఈనెల 10న దిష్టిపూజతో పనులు ప్రారంభం కాగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రజులపాటు జాతరను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. 

 

స్థల పురాణం విషయానికి వస్తే..
పూర్వం హిందువుల శివుని గుడులను నిధుల కోసం పిండారీలు ధ్వంసం చేసి దోపిడీ చేసేవారు. వీరి నుంచి భారీ విగ్రహాలు చోరీ కాకుండా అప్పటి యాదవులు లింగమంతుల, పాలచర్లయ, సౌనేశ్వరి అమ్మ, గంగ దేవుళ్ల విగ్రహాలను ఒక పాత బావిలో దాచి పెట్టారు. దీంతో వల్లాపురం గుట్ట ప్రాంతమంతా చెల్లాచెదురైందని, ప్రజలు కూడా కరువు కాటకాలతో ఆగమైనట్టు పూర్వీకులు పేర్కొంటున్నారు. కాలక్రమేనా విగ్రహాలు దాచిపెట్టిన భావి కూరుకుపోయింది. ఇదే ప్రాంతంలోని కేసారం గ్రామం మెంతబోయిన వంశానికి చెందిన ఒకరు, మున్నా వంశానికి చెందిన ఒకరు, గొర్ల వంశానికి చెందిన మరొకరు కలిసి ఆవులు, గొర్లను మేపుకుంటూ కాలం వెళ్లదీసేవారు. ఒకరోజు ఆవులు మేపే క్రమంలో ఊరి బయట విగ్రహాలు దాచిన పాత బావి పక్కన ఉన్న మర్రిచెట్టు కింద సేద తీరారు. వీరిలో ఒకరికి కలలో లింగవంతులస్వామి ప్రత్యక్షమై ”నేను ఈ పాత బావిలో ఉన్నాను. నన్ను బయటకి తీసి గుడి కట్టించండి. మీకు మేలు జరుగుతుంది” అని చెప్పినట్టు నానుడి. ఇదే విషయాన్ని స్థానికులకు తెలుపగా సంబంధిత పూజారులు చీకటాయపాలెం గ్రామానికి చెందిన తండా వంశస్థులని తెలుసుకున్నారు. వెంటనే వీరిని పిలిపించి వడ్డెరుల తవ్వకాలతో బావిలోని విగ్రహాలు బయటకు తీయించారు. ఈ క్రమంలోనే ఓ విగ్రహానికి గుణపం తగిలి విగ్రహం నుంచి పాలు కారినట్టు పూర్వీకులు చెప్తుంటారు. దీంతో పాలచర్లయ్య అని పేరుపెట్టారు. ఇలా బయటికి తీసిన మూలవిరాట్‌ విగ్రహాలను దురాశపల్లి గుట్టమీద ఏర్పాటు చేశారు. తండా, మట్ట వంశస్థులు కలిసి అక్కడే కట్టారు. ఎంతపోయిన వంశస్థులు, మున్నా వంశస్థులు కలిసి సౌనేశ్వరమ్మ గుడి కట్టారని పూర్వీకులు తెలపడం విశేషం.

తెలంగాణ వచ్చాక అంగరంగ వైభవంగా..
కాలక్రమేనా ఈ దేవాలయం ఈ ఆలయం ఎండోమెంట్‌ పరిధిలోకి పోగా రెండేండ్లకోసారి జరిగే జాతరతో లక్షల రూపాయల్లో ఆదాయం ఆలయానికి సమకూరుతున్నా ఉమ్మడి పాలనలో జాతరకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. అయితే తెలంగాణా ప్రభుత్వం వచ్చాక జాతరను అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది.  తెలంగాణా రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రల నుండి సైతం భక్తులు తండోప తండాలుగా ఈ జాతరకు తరలి వస్తుంటారు.

దేశంలోనే యాదవులకు పేరొందిన ఈ ఉత్సవాలను ప్రభుత్వం 1998లో రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతరకు భక్తులు గంపనెత్తుకోని గుట్టకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి మేకలు, గొర్రెలు బలిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో గజ్జె కట్టి ఆడుతూ, డోలు వాయిద్యాలతో పాటలు పాడుతూ లయబద్ధమైన భజనలు చేస్తు శ్రీ లింగమంతుల స్వామి వారికి పూజలు చేస్తారు. ఈ జాతరకు ప్రతీ ఏటా లక్షల్లో అదాయం వస్తోంది. ప్రతీయేటా సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.

 

భారీగా బందోబస్తు.. ప్రతీ కిలోమీటరుకు నీళ్లు..!
ఈ క్రమంలో తాగునీరు వసతి సదుపాయాలను అధికారులు చాలా జాగ్రత్తగా చేపట్టారు. ప్రతీ కిలోమీటరుకు త్రాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు కోసం ప్రతీ కిలోమీటరుకు 30నుండి 40కుళాయిలను అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణ కట్ట, వసతీ గృహాలు పూర్తి అవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను కూడా తెలంగాణ పోలీసులు పూర్తి చేస్తున్నారు. 1200మంది పోలీసులను కూడా ఈ జాతర కోసం కేటాయించారు. 30మంది సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, 90మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, ఆరు స్పెషల్ పార్టీ టీమ్ లు ఈ జాతరలో బందోబస్తు నిర్వహిస్తుండగా.. 46సీసీటీవీ కెమెరాలను బిగించినట్లు పోలీసలు చెప్తున్నారు. ఈసారి జాతరకు 20లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.