Amla : ఉసిరి ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు!.

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం అధికమోతాదులో ఉంటుంది. ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వలన, ఇది ఎసిడిటీని ప్రేరేపిస్తుంది.

Amla

Amla : ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది. కార్తీక మాసంలో వన భోజనాలు ఉసిరి చెట్ల క్రిందే ప్రారంభమౌతుంది. ఉసిరికి మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరి మన ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణిగా చెప్పుకోవచ్చు. మంచి ఆరోగ్యాన్ని అందించే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల దీనిలో ఉన్నాయి. అయితే ఉసిరి ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల, కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నవారు తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఉసిరి యొక్క దుష్ప్రభావాలను, దానిని ఎవరు తినకూడదో తెలిపేందుకు డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ అయిన డాక్టర్ అర్చన బాత్రా కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఉసిరికాయను ఎవరు తినకూడదు?

1.హైపోటెన్షన్ రోగులు తీసుకోరాదు ; ఉసిరి అధిక రక్తపోటును తగ్గించటానికి గొప్పగా తోడ్పడుతుంది. అయితే బీపీ తక్కువగా ఉన్నవారు ఉసిరిని తీసుకోవటం వల్ల బీపీ మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు అధిక మొత్తంలో ఉసిరి తీసుకోవటం ఏమంత మంచిది కాదు. రక్తపోటు స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవటానికి వ్యాయామాలు చేయటం మంచిది.

2.లో షుగర్ వ్యాధిగ్రస్థులు ; ఉసిరి మధుమేహాన్ని నియంత్రించడానికి తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తుంటారు. గృహ చిట్కాల్లో భాగంగా చక్కెర వ్యాధి గ్రస్తులు ఉసిరిని వినియోగిస్తుంటారు. అధిక చక్కెరను గ్రహించగల గొప్ప ఫైబర్ లక్షణాలు ఉసిరి కలిగి ఉంది. అయితే తక్కువ షుగర్ హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు, క్రమం తప్పకుండా యాంటీ డయాబెటిక్ మందులు తీసుకునేవారు ఉసిరి తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఉసిరి మందుల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. రక్తంలో చక్కెరను తీవ్ర స్థాయికి తగ్గిస్తుంది.

3.గుండె రోగులు జాగ్రత్తగా ఉండాలి ; ఆమ్లా కొన్ని మందులతో కొన్ని ప్రతికూల ప్రతిచర్యలకు దారితీయవచ్చు. కాబట్టి, గుండె జబ్బుతో బాధపడేవారు ఉసిరికాయల వినియోగం కోసం తప్పనిసరిగా తమ వైద్యుడిని సంప్రదించి వారి సూచనలు , సలహాలు పాటించాల్సిన అవసరం ఉంది.

4.ఎసిడిటీని ప్రేరేపిస్తుంది ; ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం అధికమోతాదులో ఉంటుంది. ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వలన, ఇది ఎసిడిటీని ప్రేరేపిస్తుంది. హైపర్‌యాసిడిటీ సమస్యలు కలిగిన వ్యక్తులకు కడుపులో ఉసిరి చికాకును కలిగిస్తుంది.

5.మలం గట్టిపడుతుంది ; ఆమ్లా నిస్సందేహంగా మలబద్ధకం కోసం ఒక ప్రసిద్ధ ఔషధం, ఎందుకంటే దానిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంది. అయినప్పటికీ, అధిక వినియోగం మలం గట్టిపడుతుంది. దీని వల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

6.డీహైడ్రేషన్ రావచ్చు ; ఉసిరిలో మూత్రవిసర్జన లక్షణాలు ఉన్నాయి. శరీరంలో మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి, ఇది కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ , బరువు తగ్గడానికి కూడా దారితీయవచ్చు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు ఉసిరికాయను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

7.చర్మ సమస్యలకు దారి తీస్తుంది ; మూత్రవిసర్జన అంటే ఇది మన శరీరం నుండి టాక్సిన్స్ ,వ్యర్థాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఈ నీటి నష్టాన్ని భర్తీ చేయకపోతే, నిర్జలీకరణం చర్మంలో మెరుపును కోల్పోయేలా చేస్తుంది, తద్వారా పొడిబారడం, వృద్ధాప్యం ఏర్పడుతుంది.. జుట్టు రాలవచ్చు. ఉసిరికాయను అధికంగా తీసుకోవడం వల్ల స్కాల్ప్ డ్రైనెస్, హెయిర్ ఫాల్, దురద, చుండ్రు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి ఉసిరికాయను తినేటప్పుడు శ్రద్ధవహించటం మంచిది. ఉసిరికాయను మితంగా జాగ్రత్తగా తీసుకుంటే ప్రయోజనకరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. రోజుకు 1 లేదా 2 మించి ఉసిరి కాయలను తీసుకోరాదు. సమస్య ఉత్పన్నమైన సందర్భంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందటం మంచిది.