Cooking Oils : వంటనూనెలు పదేపదే వేడిచేస్తున్నారా…. ప్రమాదం పొంచిఉన్నట్లే…

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం ఒకసారి వంట నూనెను వేడి చేశాక దాన్ని మళ్ళీ మళ్ళీ వేడిచేయకూడదు.

Oil2

Cooking Oils : ఆహార పదార్ధాల తయారీ కోసం మనం నూనెలను ఉపయోగిస్తుంటాం. ప్రతి ఇంట్లో నిత్యం వేపుళ్ళు, ఇతర పిండి వంటకాల సందర్భంలో నూనెను వినియోగిస్తారు. అలా పిండివంటకాలు తయారు చేయగా మిగిలిపోయిన నూనెను నిల్వవుంచుకుని తిరిగి మరోసారి వంటకాల సమయంలో దాని వినియోగించుకోవటం చాలా మందికి అలవాటు. ఒకసారి వాడిన నూనెను పదేపదే వాడుకోవటం అనేది ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే వంట నూనెను పదేపదే వేడి చేయటం వల్ల అది విషపూరితం కావచ్చు.

పదేపదే వేడి చేసిన నూనెను వినియోగించటం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. నూనెను రెండు సార్లకు మించి వేడి చేయటం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్ మూడింతలు పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈతరహా ట్రాన్స్ ఫ్యాట్ మనిషికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం ఒకసారి వంట నూనెను వేడి చేశాక దాన్ని మళ్ళీ మళ్ళీ వేడిచేయకూడదు. ఇలా చేయటం వల్ల నూనెలో కొవ్వుల స్ధాయి పెరుగుతాయి. ఇలాంటి నూనెను ఆహారపదార్ధాల్లో వినియోగిస్తే బరువు పెరగటం ఖాయం. సాధారణంగా బయట బజ్జీలు, ఇతరత్రా స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసే వారు పలు పర్యాయాలు వేడి చేయగా మిగిలిపోయిన నూనెను తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి దానిని వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి పదార్ధాలను తినే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

పలు పర్యాయాలు వేడి చేసిన నూనెతో తయారైన పదార్ధాలను తినటం వల్ల బిపీతోపాటు, గుండె జబ్బుల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. మనిషి జీవితం ఎంతో విలువైనది. శరీరంలోని అవయవాలు రుగ్మతలకు లోనుకాకుండా కాపాడుకోవాలంటే విషతుల్యమైన నూనెలతో తయారు చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటమే మంచిది.