Children
Children : పిల్లల పెంపకం అన్నది ఒక కళ, తల్లి దండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లల ముందు పెద్దలు ఎలా మాట్లాడతారు, వారికి ఎలాంటి మాటలు చెబుతారు, వారి ముందు ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం కూడా తల్లి దండ్రుల చేతుల్లోనే ఉంటుంది. పిల్లల మొదటి గురువు తల్లితండ్రులే. పిల్లలు ఇంట్లో పెద్దవాళ్లను చూసి ప్రభావితమవుతారు. అందుకే పిల్లలతో ఆచి తూచి మాట్లాడాలి.
తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపం ఉన్నట్లైతే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించవలసి ఉంటుంది. ఇంట్లో తల్లితండ్రులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు తెలివిగా, చాలా జాగ్రత్తగా స్పందించాలి. ఎలాంటి పదాలు పిల్లల ముందు మాట్లాడకూడదో తెలుసుకోవాలి. పిల్లల వయస్సులను బట్టి వారి శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులు మారుతూ ఉంటాయి. వాటిని పెద్దలు సరిగా అర్ధం చేసుకోకపోవటం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి.
పిల్లలను ఎవ్వరితోనూ పోల్చరాదు. నీకు ఇది సాధ్యపడదు, నువ్వు చేయలేవు లాంటి మాటలు అనకూడదు. అలా అనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పిల్లలలో ఆడ, మగ బేధం చూపించకూడడు. పిల్లలు ఏది అడిగినా లేదు, కాదు, కూడదు అనే పదాలు సాధ్యమైనంత వరకు ఉపయోగించడం ప్రమాదకరం. ఊరికే అలాంటి మాటలు వింటుంటే వారి విశ్వాసం కోల్పోయి, వారిలో భయం పెరుగుతుంది. పిల్లలు మీరు చెప్పింది వినట్లేదని, మీతో మాట్లాడవద్దు లాంటి మాటలు అనకూడదు. అలా అనడం ద్వారా వారిలో ఆందోళన కలగవచ్చు.
పిల్లల ప్రాధమిక అవసరాలను తీర్చటం తల్లితండ్రుల బాధ్యత. పిల్లలకు వారి పనులు వారే స్వతహాగా చేసుకోవటం అలవాటు చేయాలి. వారి పసితనాన్ని ఆస్వాదించేలా చేయాలి. చిన్న పిల్లల్ని చిన్న విషయానికి బాధపెట్టరాదు. పిల్లలని నిరుత్సాహపరచకుండా, మేమున్నాం అనే ధైర్యాన్ని నింపాలి. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి. పిల్లలు ఏడుస్తూనో, అరుస్తూనో తమ ప్రకోపాన్ని వెల్లడిస్తున్నపుడు అడ్డు తగలకండి. అలాంటి సమయంలో మీరు ఏమి మాట్లాడినా పిల్లలు వ్యతిరేక భావంతోనే అర్ధం చేసుకుంటారు.