పుల్వామా దాడి తర్వాత 2019లో ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జైషే ఈ మొహమ్మద్ (JeM) ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరడయ్యారు. ఇప్పుడు ఆయన భార్య 28ఏళ్ల నితికా కౌల్ భారత ఆర్మీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు ఏడాది 2018లో ఏప్రిల్ నెలలో ఆర్మీ అధికారి శంకర్‌తో కౌల్ వివాహం జరిగింది.
కశ్మీర్ కు చెందిన కౌల్.. ఇటీవలే షార్ట్ సర్వీసు కమిషన్ (SSC) పరీక్షను పూర్తి చేసింది. ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం ఆమె మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తోంది. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత నితికా కౌల్ భారత సైన్యంలో ట్రైనీగా చేరనుంది. భారత ఆర్మీలో చేరడమే తన భర్తకు ఇచ్చే అసలైన నివాళిగా కౌల్ పేర్కొంది. ఢిల్లీలో కౌల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. తన భర్త మాదిరిగా మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తోంది.
అందులో భాగంగానే తాను ఆర్మీలో చేరాలని కోరుకుంటోంది. ‘కొత్త విషయాలను నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కార్పొరేట్ కల్చర్ నుంచి ఆర్మీలో చేరడం అనేది గొప్ప మార్పు. సాయుధ దళాల సంస్కృతికి తగినట్టుగా ఎలా ఉండాలో అలవర్చుకున్నాను’ ఆమె అన్నారు. ‘నా భర్తను కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. నెమ్మదిగా నా మనస్సు కుదటపడుతుండటంతో.. షార్ట్ సర్వీసు కమిషన్ ఎగ్జామినేషన్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. గత ఏడాదిలో సెప్టెంబర్ నెలలో పరీక్షకు దరఖాస్తు చేశాను. కానీ, నేనూ నా భర్త నడిచిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను’ అని కౌల్ తెలిపారు. తన భర్త పరీక్ష రాసిన విధానం గురించి చెబుతూ కౌల్ కంటతపడి పెట్టారు.
పరీక్షా కేంద్రంలోకి వెళ్లగానే భావోద్వేగానికి గురయినట్టు తెలిపారు. తన భర్త మరణంతో తిరిగి సాధారణ జీవితంలోకి తిరిగి రావడం అంతా సులభం కాదని ఆమె అన్నారు. ఏదైనా పనిలో మునిగితే తప్ప బాధ నుంచి బయటపడలేమన్నారు. నా భర్త మరణించిన 15 రోజుల తర్వాత మళ్లీ పనిపై దృష్టిపెట్టాను. నాకు నేను పనిలో నిమగ్నమైయ్యేలా ప్రేరేపించుకున్నాను. ఇలా చేయడం కష్టమైనపనే.. పరిస్థితులను మనం అంగకీరించాల్సిందే. నాలో నా పనిలో సానుకూలతను గుర్తించి ఆ దిశగా ముందుకు సాగాలనుకున్నాను. మరోసారి నా కాళ్లపై నేను నిలబడాలి’ అని కౌల్ ఉద్వేగభరితంగా చెప్పారామె.