Diabetes : మధుమేహానికి ఆయుర్వేద ఔషదం బెస్ట్.. తాజా అధ్యయనంలో వెల్లడి

కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన తర్వాత, ఆయుర్వేద ఔషధం మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉందని వారు గుర్తించారు.

Diabetes

Diabetes : పంజాబ్‌లోని చిత్కారా విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో మధుమేహం చికిత్సలో ఆయుర్వేద ఔషధం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ విషయం సెర్బియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ అండ్ క్లినికల్ రీసెర్చ్ తాజా సంచికలో ప్రచురించబడింది. ఈ పరిశోధనలో ఆయుర్వేద ఔషధం కేవలం మధుమేహాన్ని తగ్గించడమే కాకుండా శరీరంలోని దెబ్బతిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మధుమేహాన్ని నియంత్రించడం అన్నది పెద్ద సవాల్ గా మారింది. ఈ కారణంగా ప్రజలు మధుమేహానికి వివిధ రకాల చికిత్సా పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధాలపై పరిశోధనలు చాలా తక్కువ ఉన్ననేపధ్యంలో ఈ వైద్యం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు.

చిత్కారా విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్ రవీందర్ సింగ్, డాక్టర్ ఠాకూర్ గుర్జీత్ సింగ్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన వారి బృందం 100 మంది మధుమేహ రోగుల అధ్యయన బృందంపై ఫేజ్ IV క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. అధ్యయనం కోసం డబుల్ బ్లైండ్ ట్రయల్స్ నిర్వహించారు. మధుమేహాన్ని కలిగిన ఉన్న రోగులకు ఇచ్చిన మందుల గురించి వారికి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అధ్యయనానికి ఎంచుకున్నవారిలో కొందరికి అల్లోపతి ఔషధం సిటాగ్లిప్టిన్, మరికొందరికికి ఆయుర్వేద ఔషధం BGR-34 అందించారు.

కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన తర్వాత, ఆయుర్వేద ఔషధం మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉందని వారు గుర్తించారు. ఆయుర్వేద ఔషధం చక్కెర స్థాయిలను తగ్గించి, ప్యాంక్రియాస్‌లోని బీటా కణాల పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనం ద్వారా నిర్ధారణకు వచ్చారు. తొలివిడత ఫలితాలు గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1c) యొక్క బేస్‌లైన్ స్థాయి క్షీణతను చూపించాయి. రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్‌లో సైతం ఔషధాన్ని గుర్తించారు.

అధ్యయనం ప్రకారం, ట్రయల్ ప్రారంభంలో రోగులలో HbA1c ప్రాథమిక విలువ 8.499% ఉండగా ఆయుర్వేద ఔషధం తీసుకున్న నాలుగు వారాల తర్వాత, విలువ 8.061%కి తగ్గింది. ఎనిమిది వారాల తర్వాత ఆ విలువ 6.56%కి, 12 వారాల తర్వాత 6.27%కి తగ్గింది. BGR-34 అనేది ఒక ఆయుర్వేద ఔషదం. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్‌లు, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ , సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ,శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేశారు. ఈఔషదాన్ని AIMIL ఫార్మాస్యూటికల్స్ విక్రయిస్తోంది.