Dental Health : దంతాల ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

తెల్ల ఉల్లిపాయ రసంలో పంచదార కలిపి త్రాగితే నోటి వెంట పడే రక్తం తగ్గిపోతుంది. ఉప్పు, ఉల్లిపాయ నూరి దాన్ని పళ్ళకు రుద్దితే పళ్ళ వెంట కారుతున్న రక్తం ఆగిపోతుంది.

Dental Problems

Dental Health : నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయి. మనం తీసుకునే ఆహారమంతా నోటి నుంచే పోతుంది కనుక, నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి. నోటి శుభ్రత పాటించకుంటే చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దంతాల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్య వంతమైన దంతాలు మీ సొంతమౌతాయి.

తేనె, నెయ్యి, పిప్పళ్ళ చూర్ణం కలిపి పళ్ళకు రాస్తే పళ్ళ నొప్పి తగ్గిపోతుంది. ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకుంటే పళ్ళు శుభ్రపడి రోగాలు రావు. మఱ్ఱి ఊడలతో పళ్ళు తోముకుంటే కదిలే పళ్ళు సైతం గట్టిపడతాయి. నల్ల నువ్వులు తిని వెంటనే చల్లని నీరు త్రాగితే కదిలే దంతాలు గట్టిపడతాయి. గుంటగలగరాకు వేళ్ళు, పసుపు సమానంగా తీసుకుని నీళ్ళతో నూరి లేపనంగా రాస్తే దంత సమస్యలు తొలగిపోతాయి.

తమలపాకులు నాలుగు, పచ్చ కర్పూరం చిటికెడు, ఇలాచి, లవంగాలు, గసగసాలు, కొబ్బరి, నెయ్యి కలిపి తింటే పళ్ళు గట్టిపడతాయి. మెదడులో ఆలోచనలు కలుగుతాయి. జీర్ణక్రియకు తోడ్పడటంతోపాటు నోటి దుర్వాసన పోతుంది. మంచి ఇంగువ నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దానిని దూదితో తడిపి పంటి నొప్పి ఉన్నచోట పూస్తే నొప్పి పోతుంది.

తెల్ల ఉల్లిపాయ రసంలో పంచదార కలిపి త్రాగితే నోటి వెంట పడే రక్తం తగ్గిపోతుంది. ఉప్పు, ఉల్లిపాయ నూరి దాన్ని పళ్ళకు రుద్దితే పళ్ళ వెంట కారుతున్న రక్తం ఆగిపోతుంది. పళ్ళను కుంకుడు కాయ నురుగుతో రుద్దితే పళ్ళు తళతళ మెరుస్తాయి. పటిక, పోక చెక్కల బొగ్గు, గచ్చకాయలు కాల్చిన బొగ్గు అన్ని సమపాళ్ళలో తీసుకుని పళ్ళు తోముకుంటే చిగుళ్ళ పుండ్లు, చీము కారటం , రక్తం కారటం, పంటి నొప్పి తగ్గిపోతాయి.

జాజిచెట్టు వేరు చూర్ణంతో పళ్ళు తోముకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. పసుపు కొమ్మును నిప్పులపై కాల్చిన మసితో పళ్ళు తోమితే పంటి నొప్పులు తొలగిపోతాయి. నీరుల్లి పాయను మెత్తగా నూరి ఆగుజ్జుతో పళ్లు తోముకుంటే అన్ని రకాల దంత వ్యాధులు పోతాయి. సీమ సున్నం 40 గ్రాములు, కరక్కాయ పొడి 10 గ్రాములు కలిపి పంచదార వేసి తగినంత కలిపి ఉదయం, సాయంత్రం, రెండు పూటలా పళ్ళకు రుద్దితే చిగుళ్ళు గట్టిపడి రక్తం కారటం తగ్గిపోతుంది.

బాదాము కాయల పెచ్చులు కాల్చిన మసితో పళ్ళు తోమితే పళ్ళ నొప్పులు పోతాయి. నల్లతుమ్మ చెక్క కషాయంతో నోటిని పుక్కిలిస్తే దంత, చిగుళ్ళ నొప్పులు, వాపులు, నోటి పూత అరికడుతుంది. పిప్పళ్ళు, సైంధవ లవణము, జీలకర్ర మెత్తగా నూరి దంతాలపైన పూస్తే పురుగులు పోయి నొప్పి తగ్గుతుంది. నేరేడు చక్క చూర్ణము, వాము, ముద్ద కర్పూరం కలిపి రాస్తే దంతాలకు సంబంధించిన అన్ని వ్యాధులు తొలగుతాయి. అక్కల కర్ర, హారతి కర్పూరం, మిరియాలు సమయంగా కలిపి నూరి పళ్ళకు రాస్తే దంత వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.