tangedu flower bathukamma
Bathukamma 2023 : బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని అన్నదమ్ములు దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ అంతా సందడి సందడిగా మారిపోతుంది.ఇళ్లన్ని రంగు రంగు పూలతో గుభాళిస్తాయి. బతుకమ్మలను పేర్చేందుకు ఆడబిడ్డలు రంగు రంగుల పూలను సిద్ధంచేసుకుంటారు. ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునే ఈ బతుకమమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో అత్యంత శోభాయమానంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పి తీరాల్సిందే. మొత్తం తొమ్మిది రోజుల పాటు..తెలంగాణ ఆడబిడ్డలు తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజించుకుంటారు.
ఈ బతుకమ్మ పండుగలో..బతుకమ్మను పేర్చటంలో తంగేడు పూలు ప్రత్యేకమైనవి. పసుపు రంగులో చక్కటి ఆకర్షణగా నిలిచే తంగేడు పువ్వుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి గుర్తింపును..విశిష్టతను ఏర్పరచింది. బతుకమ్మ పండుగలో తనదైన ప్రత్యేక పాత్ర వహించే తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. అంతటి విశిష్టత తంగేడు పువ్వుకు ఎలా ఏర్పడింది…ముళ్ల కంచెల్లోను, తుప్పల్లోను..గుట్టలమీద రాళ్లలోను ఎక్కడపడితే అక్కడ మొలిచి విరబూసి ఈ తంగేడు మొక్కల పువ్వులకు ఎందుకు అంతటి విశిష్టత ఏర్పడింది..? బతుకమ్మకు తంగేడు పూలకు సంబంధమేంటి..? దీని వెనుక ఉన్న ఓ ఆసక్తికర కథను తెలుసుకుందాం..
Bathukamma 2023 : తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలు, నైవేద్యాలు
బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలున్నాయి. వాటిలో ఓ కథ తంగేడు పూలతో బతుకమ్మకు ఉన్న అనుబంధం గురించి చెబుతోంది. పూర్వకాలంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లి ఉండేది. ఆ చెల్లి అంటూ ఏడుగురికి పంచ ప్రాణాలు. తమ ముద్దుల చెల్లికి చిన్న దెబ్బ తగిలినా అన్నల మనస్సు విలవిల్లాడిపోయేది. చెల్లిని అంత ప్రాణంగా చూసుకోవటం అన్నల భార్యలకు ఇష్టముండేది కాదు. ఆడబిడ్డ అంటే అసూయపడేవారు. అన్నలు ఎక్కడికెళ్లినా చెల్లెలి కోసం ప్రత్యేక బహుమతులు తెచ్చేవారు. దాంతో వదినలకు కంటగింపుగా ఉండేది. ఆడబిడ్డ అంటేనే గిట్టేది కాదు. కానీ భర్తలకు భయపడి ఊరుకునేవారు.
ఇలా అన్నల ప్రేమాభిమానాలతో చెల్లెలు సంతోషంగా జీవిస్తుంటే ఆడబిడ్డను చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వదినల మనస్సు కుతకుత ఉడికిపోయేది. దీనిని ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశ్శాంతి అనుకునేవారు. దానికి తగిన సమయం కోసం వేచి చూసేవారు. ఈక్రమంలో ఓ రోజు అన్నలు వేటకెళ్లాళ్లు. తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి వారి మనస్సులో ఓ దుర్భుద్ధి పుట్టింది. ఇదే సమయం ఆడబిడ్డను వదిలించుకోవటానికి అనుకున్నారు. తోడి కోడళ్లంతా ఏకమయ్యారు. ఆడబిడ్డను ప్రతీ చిన్న విషయానికి సాధించటం మొదలుపెట్టారు. అలా ఆడబిడ్డను చంపేసి ఊరి బయట పాతి పెట్టారట. ఆ తర్వాత ఊరి బయట పాతి పెట్టిందని అక్కడ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసిందట.
Bathukamma 2023 : బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం, రమణీయమైన పూలలో ఔషధ గుణాలు
ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు ఎప్పటిలాగానే బహుమతులు తెచ్చారు. ఇంటికి రాగానే భార్యాల్ని అడిగారు తమ బంగారు చెల్లెలు ఏది అని దానికి వారంతా పొంతనలేని సమాధానాలు చెప్పారు. మీకోసం బెంగ పెట్టుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పారు. కానీ అన్నదమ్ములందరికి అనుమానం వచ్చింది. చెల్లెల్ని వెదుక్కుంటు బయలుదేరారు. అలా తిరిగి తిరిగి ఓ చోట కూర్చున్నారు. చెల్లెలి ముచ్చట్లు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. అన్నదమ్ములు తనకోసం పడుతున్న బాధల్ని చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి చెప్పిందట. అప్పుడు అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయండని చెప్పిందని, అలా ఈ పండుగ మొదలైందనే కథ ఉంది.