Friendships on social media : సోషల్ మీడియా స్నేహాలు సేఫేనా? వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటే అంతే…..

తెల్లవారితే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలి. లేదంటే ప్రపంచం ఏమైపోతోందో అనే దిగులు. అంతలా దానికి జనం అడిక్ట్ అయిపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కూడా కాదని ముఖ పరిచయం లేనివారి మాటలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే తీవ్రమైన ఒత్తికిడి లోనైపోతున్నారు. అసలు ఈ ఆన్ లైన్ స్నేహాలు ఎంతవరకూ సేఫ్?

Friendships on social media

Friendships on social media : ఒకప్పుడు నిద్రలేవగానే దేవుడి చిత్రపటాన్నో.. ఇంట్లో తమకి ఇష్టమైన వారి ముఖాన్నో సెంటిమెంట్‌గా చూసేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు కళ్లు తెరవగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకోవాలి. ముఖం కడుక్కుంటున్నా.. వాష్ రూంలో ఉన్నా.. టిఫిన్ చేస్తున్నా.. బయట నడుస్తున్నా.. అసలు ఏం చేస్తున్నా.. దేన్నైనా మర్చిపోతున్నారు కానీ చేతిలో సెల్ ఫోన్‌ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో చిక్కుకుపోతున్నారు. ఒక్కసారిగా సెల్ ఫోన్లు పనిచేయడం ఆగిపోతే మనుష్యులంతా ఏమైపోతారా? అని భయపడేంతలా వాటికి అడిక్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

High Blood Pressure: వారానికి 30 నిమిషాలకు మించి సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి ..

సోషల్ మీడియా మాయలో పడి అనుబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇంట్లో అంతా కలిసి ఉన్నా ఎవరి రూంలో వారు సెల్ ఫోన్లతో గడిపేస్తున్నారు. పక్క రూంలో ఉన్నవారికి కూడా కాల్స్, మెసేజస్ తప్ప ఎదుటపడి మాట్లాడుకునే రోజులు పోతున్నాయి. రోడ్లు, పార్కులు, బస్సులు, ట్రైన్‌లు ఎక్కడ చూసినా మనుష్యులతో మనుష్యులు ఎదురుపడి మాట్లాడుకునే రోజులు పోయాయి. కంటికి కనపడని వారితో కబుర్లు చెప్పుకుంటూ ఓ మాయాలోకంలో విహరిస్తున్నారు. ముఖ పరిచయం లేని వారితో స్నేహాలు.. డేటింగ్స్ పేరుతో మోసపోవడాలు. ఆ తరువాత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లడం.. ఆత్మహత్యలకు పాల్పడటం వంటి అనేక ఘటనలు చూస్తున్నాం.

 

సోషల్ మీడియా ద్వారా మంచి స్నేహితులు అయినవారు లేకపోలేదు. అయినా కూడా ఆ ప్లాట్‌ఫామ్ మీద స్నేహితుల్ని ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాము.. వారి ప్రొఫైల్ కరెక్టేనా? వారు అసలు నిజంగా ఆడా.. మగా? వారు చెప్పేవి నిజాలేనా? అనేవి ఆలోచించకుండా తొందరపడి స్నేహాలు చేస్తే ఆనక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ఫేక్ ఐడీలతో ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా చాటింగ్స్ చేస్తూ బుట్టలో వేస్తున్న సంఘటనలు ఎన్నో విన్నాం. వారి కల్లబొల్లి మాటలు నమ్మి లక్షలు సమర్పించి ఆనక మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఇక కొంతమంది అమాయకులు వారి మాటలు నమ్మి ప్రేమ అనే భ్రమలో వారి కోసం వెళ్లిపోతున్నారు. కొన్ని రోజులు వారితో జీవితం బాగానే ఉన్నా ఒక్కొక్కటిగా వారి మోసం బయటపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

Cell Phone : నిద్రలేవగానే మీ చూపంతా సెల్ ఫోన్ పైనేనా? అయితే జాగ్రత్త పడాల్సిందే!

కష్టంలో ఉన్నామనో.. తమ ఇంట్లో వారికి బాగా లేదనో నమ్మించి ఆర్ధిక సాయం కోరేవారి సంఖ్య కోకొల్లలు. అలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నా వారి చేతుల్లో చాలామంది మోసపోతున్నారు. ఇక మాటల్లోకి దింపి ఎదుటివారి బలహీనతను క్యాష్ చేసుకునే గుంపులు చాలానే ఉంటున్నాయి. ఏ మాత్రం వారి మాటలకు పడిపోయినా ఫోటోలు, వీడియోలతో బెదిరించి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు. పరువు పోతుందని వారికి భయపడి డబ్బులు ఇచ్చి వదిలించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక కల్లబొల్లి మాటలకు పడిపోయి ప్రేమనే భ్రమలో జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న యువతని చూస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్లు ఎంతో బాధ్యతగా చూసి చేసిన పెళ్లిళ్లలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటిది సోషల్ మీడియా వేదికలపై పరిచయమైన వారిని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అంటే ఎంత ఆలోచించాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి?

 

 

 

కొంతమంది కుటుంబసభ్యులు, స్నేహితుల కన్నా సోషల్ మీడియాలో పరిచయం అయిన వారిని బాగా నమ్ముతారు. వారితో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. నమ్మి కుటుంబ విషయాలు, ఆర్ధిక విషయాలు అన్నీ షేర్ చేసుకుంటారు. అవతలి వ్యక్తులు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈజీగా మోసం చేస్తారు. సాయం చేస్తున్నామని నమ్మించి అన్ని విషయాలు తెలుసుకుని ఇతరులకు చెబుతామనో.. పరువు తీస్తామనో బెదిరించే వాళ్లు లేకపోలేదు. ఇక సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇతరులకు పంపడంవల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పర్మిషన్ లేకుండా ఇతరుల ఫోటోలు లాంటివి షేర్ చేయడం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

Funny incident : ఫోన్ చూస్తూ సర్వం మర్చిపోతే ఇలాగే… ఉంటుంది

సోషల్ మీడియా ఎంత పాపులారిటీని తెస్తుందో.. స్టేటస్ ఇస్తుందో అంతగా పతనాన్ని చూపిస్తుంది. కనిపించే ప్రతి వ్యక్తిని నమ్మడం.. అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల అనేక అనర్ధాలు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా నమ్మడం.. వారు చెప్పేదంతా నిజమనుకోవడం మానేయాలి. వ్యాపారం పేరుతో.. వడ్డీల పేరుతో అనేకమంది ఎర వేస్తుంటారు. వారి మాటలు నమ్మి పెట్టుబడులు పెడితే అంతే. ఆనక వారి అడ్రస్ గల్లంతవుతుంది. మన ఇల్లు గుల్లవుతుంది. అందుకే సోషల్ మీడియాలో స్నేహం చేసేముందు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. లేదంటే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. బీ కేర్ ఫుల్ ఫ్రెండ్స్.. కనిపించని స్నేహాల కన్నా.. కళ్లముందు కనపడే కుటుంబసభ్యులు, స్నేహితులకు సాటి వేరేవరు రారనే విషయాన్ని గుర్తుంచుకోండి.