ఇకపై లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13 మాత్రమే! 

  • Publish Date - February 13, 2020 / 11:19 AM IST

వాటర్ బాటిల్ ధరలు అమాంతం పెంచేస్తున్నారు. దాహమేసి గుక్కెడు నీళ్లు తాగాలంటే లీటర్ బాటిల్ పై రూ.20 వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. పెంచిన వాటర్ బాటిళ్ల ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో నిత్యావసర వస్తువుల చట్టం కిందకు వాటర్ బాటిళ్ల ధరను తీసుకురావాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

వాటర్ బాటిల్ ధరలపై నియంత్రించేందుకు వీలుగా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13లుగా ఫిక్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది లెఫ్ట్ గవర్నమెంట్. కేరళలో ప్రస్తుతం ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఖరీదు ఉంది. ఆహారం, పౌర సరఫరాల మంత్రి పి.థిలోత్తమన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వాటర్ బాటిల్ ధరలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘రాష్ట్రంలో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13 ఖరీదు. రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ప్రజల అభిప్రాయాల మేరకు నిత్యావసర వస్తువుల కేటగిరి కిందికి వాటర్ బాటిల్ ధరలను తీసుకొచ్చింది’ అని థిలోత్తమన్ చెప్పారు. 

రెండేళ్ల క్రితమే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను రూ.11 నుంచి రూ.12లకు తగ్గించాలని భావించింది. అదే సమయంలో బాటిల్ వాటర్ తయారీదారులు, ట్రేడర్లు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో అమలు చేయడం కుదరలేదని మంత్రి అన్నారు. కేరళలో ఇప్పుడు ఎవరైనా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13 కంటే ఎక్కువగా ప్యాకేజీతో అమ్మితే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.