Intermittent Fastin Concept Empty Plate On Blue Background, Copy Space
Fasting : లంకణం పరమౌషధమని చెప్తుంటారు మన పూర్వికులు. మూడుపూటలా తినే వారితో పోలిస్తే అర్ధాకలితో కాలం గడిపేవారికి ఆయుర్ధాయం ఎక్కువ ఉంటుందని చెప్తుంటారు. అనేక అధ్యయనాలు సైతం దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవలికాలంలో బరువు తగ్గేందుకు చాలా మంది ఉపవాసాల బాట పడుతున్నారు. దీని వల్ల బరువు తగ్గటమే కాక, శరీరంలో పేరుకు పోయిన కొవ్వులను కరిగించుకుంటున్నారు.
ఆహారాన్ని ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దికొద్ది మోతాదులో తీసుకుంటూ అప్పుడప్పుడు ఒక రోజు ఆహారం మానేయటం కొన్ని పర్యాయాలు పండ్లతో సరిపుచ్చటం లాంటివి చేస్తుంటారు. ఈ ప్రక్రియనే ఉపవాసంగా పిలుస్తారు. అయితే ఉపవాసాన్ని ఆరోగ్యంతో ఉన్నవారు మాత్రమే చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు, అరవై ఏళ్ల వయస్సు పైబడిన వారు , గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవారు ముఖ్యంగా మధుమేహులు ఉపవాసాలు చెయ్యటం ఏమంత శ్రేయస్కరం కాదు.
ముఖ్యంగా మధుమేహుల విషయానికి వస్తే వీరి రోజు వారిగా ఆహారం తీసుకుంటున్నప్పటికీ తీసుకున్న ఆహారాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్ధితి లేదు. మధుమేహాన్ని వైద్య పరిభాషలో అగ్యుమెంటేడ్ స్టార్వేషన్ అంటారు. పిండి పదార్ధాలు వంటివాటిని తీసుకుంటున్నా వీరిలో శరీరం ఎలాగొలా కొవ్వు పదార్ధాల నుండి శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ స్ధితిలో వీరు గంటల సమయంలో ఆహారం తీసుకోకుండా ఉంటే అగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది బాగా పెరుగిపోతుంది. 6గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుంటే శరీరం పూర్తిగా కొవ్వు పదార్ధాల మీదే ఆధారడుతుంది.
ఈ క్రమంలో మధుమేహుల శరీరంలో పలు ఆమ్లాల స్ధాయిలు పెరిగిపోతాయి. వీటినే కీటోన్ బోడీస్ అంటారు. శరీరంలో వీటి స్ధాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటూ క్రమేపి విఫలమై పోతుంటాయి. అందుకే మధుమేహులకు సర్జీరీలు చేయాల్సి వస్తే ఆహారం ఇవ్వ కూడని పరిస్ధితి ఎదురైన సందర్భంలో ఒకవైపు గ్లూకోజు ఎక్కిస్తూ మరో వైపు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తారు. మధుమేహులు అనుకోని సందర్భంలో ఆహారానికి దూరం కావాల్సి వస్తే ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం.
కాబట్టి మధుమేహులు ఉపవాసం చేయకుండా ఉండటమే మంచిది. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్నవారికి ఉపవాసం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు. దీని వల్ల వారు త్వరగా మధుమేహం బారిన పడకుండా ఉండవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. మధుమేహం లేని వారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు అప్పుడప్పుడు ఒక క్రమపద్దతిని ఎంచుకుని ఉపవాసాలు చెయ్యటం వల్ల ఆరోగ్యానికి మంచి కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.