Amoebiasis : అమీబియాసిస్ తో జాగ్రత్త…ప్రాణాంతకం కావచ్చు?

ఈ క్రిములు ప్రేవుల్లో ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ అంటారు.

Amoebiasis

Amoebiasis : సమాజాన్ని పట్టి పీడిస్తున్నసాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్‌ ఒకటి. ఎంటమీబా హిస్టలిటికా అనే క్రిమి వలన ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అపరిశుభ్రమైన తాగు నీటి ద్వారా, సరిగ్గా ఉడకని, కలుషిత ఆహార పదార్థాల ద్వారా సంక్రమిస్తుంది. అమీబియాసిస్‌ను కలుగజేసే క్రిమి సిస్ట్‌ రూపంలోనూ, ట్రోఫోజాయిట్‌ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ట్రోఫోజాయిట్‌ రూపంలో ఉన్నవి జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ తాకిడికి నాశనమైపోతాయి. కాని సిస్ట్‌ రూంపలో ఉన్నవి మాత్రం ఆ యాసిడ్‌ ప్రభావాన్ని తట్టుకుని కిందకు ప్రయాణించి, పెద్దప్రేవుల్లో స్థానం ఏర్పరచుకుంటాయి.

కలుషితమైన నీరు, ఆహారపదార్థాల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల దీర్ఘకాలికంగా నీరసంగా ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యాధి క్రిములున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాధి వ్యాపిస్తుంది. చాలా మంది తమలో వ్యాధి కారక క్రిములు ఉన్నట్లు గుర్తించలేరు. అలాంటి వారిని క్యారియర్స్ అంటారు. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం దీర్ఘకాలికంగా విపరీతమైన నీరసం బరువు కోల్పోవడం, మలబద్ధకం జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన ద్రవరూప మలం రక్తం, జిగురులతో కలిసి రోజూ ఎక్కువసార్లు విసర్జించాల్సివస్తుంది. కడుపునొప్పి, మలద్వారం వద్ద అసౌకర్యమయైన నొప్పి, వాంతులు, అస్పష్టమైన కాలేయ వృద్ధి జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రేవుల్లో రంధ్రాలు ఏర్పడి రక్తస్రావం జరుగవచ్చు.అపెండిసైటిస్‌ వ్యాధికి గురి కావాల్సి వస్తుంది.

ఈ వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు రెండు వారాలనుంచి రెండు నెలల లోపు బహిర్గతమవుతాయి. ఈ క్రిములు ప్రేవుల్లో ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ అంటారు. ఈ క్రిములు ప్రేవులనుంచి చొచ్చుకునిపోయి, రక్తం ద్వారా కాలేయంలోకి చేరతాయి. అమీబియాసిస్‌ వ్యాధి దీర్ఘకాలంగా ఉండటం వలన పెద్ద ప్రేవుల్లో, ముఖ్యంగా సీకం, డిసెండింగ్‌ కోలాన్‌ ప్రాంతాలలో అల్సర్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నిర్ధారణకు మలపరీక్ష, ఎక్స్‌రే, సిగ్మాయిడోస్కోపి ఉపకరిస్తాయి. హెపాటిక్‌ అమీబిక్‌ లివర్‌ ఆబ్సెస్‌ను ఎక్స్‌రే ద్వారా, స్కానింగ్ ద్వారా, చీమును ఆస్పిరేట్‌ చేసి పరీక్షించడం ద్వారా నిర్ధారించవచ్చు.