ఆమ్లెట్ బండారీ.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో పరిచయం అక్కర్లేని వ్యక్తి. అసలు పేరు రామచంద్ర బండారీ ఆమ్లెట్ బండారీగా పాపులర్ అయ్యారు. బండారి తీసుకున్న నిర్ణయం స్థానికులను షాక్‌కు గురి చేసింది. మంగళూరులో అంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. షాపుని క్లోజ్ చెయ్యడం. షాప్ క్లోజ్ చేయడంలో పెద్ద వింత ఏముంది? అనే డౌట్ వచ్చింది కదూ. అందులో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 51 ఏళ్ల తర్వాత ఆయన తన షాప్‌ని క్లోజ్ చేయాలని నిర్ణయించారు. 2018, డిసెంబర్ 31 మంగళవారం షాప్‌ని క్లోజ్ చేస్తున్నారు. 74 ఏళ్ల బండారి భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నారు. దీంతో షాప్‌ని మూసివేయాలని డిసైడ్ అయ్యారు.
రామచంద్ర బండారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మిన్. ఆ రోజుల్లో అంటే 1966లో గుడ్డుని నాన్‌వెజ్‌గా భావించేవారు. గుడ్డుని తినడం పక్కన పెడితే అసలు ముట్టుకునే వారు కూడా కాదు. అలాంటి రోజుల్లోనే బండారి సంచలనం సృష్టించారు. తన షాప్‌లో గుడ్లను అమ్మడం స్టార్ట్ చేశారు. తన స్నేహితుడి కోళ్ల ఫామ్ నుంచి ఎగ్స్ తీసుకొచ్చి విక్రయించే వాడు. ఆ రోజుల్లో గుడ్డు ధర 15పైసలు. అయితే పెద్దగా కొనేవాళ్లు లేకపోయారు. దీంతో బండారికి మరో ఐడియా వచ్చింది. అదే గుడ్డుతో ఆమ్లెట్ వేయడం. అలా ఆయన ఆమ్లెట్ అమ్మడం మొదలు పెట్టారు. గుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవచ్చు అనే విషయం ఎవరికీ తెలియని రోజులవి. గుడ్డుని పగలకొట్టి ఉప్పు కారం నూనె వేసి దానిపై బన్ ముక్క ఉంచి అమ్మడం ప్రారంభించారు. అలా ఆయన ఆమ్లెట్ ఫేమస్ అయ్యింది. ఆమ్లెట్ రుచి బాగుండటంతో జనాలు ఆయన షాప్‌కి క్యూ కట్టారు.
క్రమంగా రామచంద్ర బండారీ కాస్తా ఆమ్లెట్ బండారిగా పాపులర్ అయ్యారు. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా బండారి ఆమ్లెట్ తినేవారి జాబితాలో చేరిపోయారు. పెద్దపెద్ద ట్రాన్ప్‌పోర్టు ఓనర్లు, ప్రభుత్వ సెక్రటరీలు, బడా వ్యాపారవేత్తలు.. ఇలా చాలామంది బండారి ఆమ్లెట్ తినేందుకు వచ్చారు. ఆమ్లెట్ అమ్మడంతో బండారీ అనేక ఇబ్బందులు పడ్డారు. తన సామాజికవర్గం నుంచి దాడులు కూడా ఎదుర్కొన్నారు. బ్రాహ్మిన్ అయ్యి ఉండి గుడ్డు ఎలా అమ్ముతావు? అని పలుమార్లు ఆయనపై దాడులు జరిగాయి. అయితే బండారీ మాత్రం వెనక్కితగ్గలేదు. గుడ్డు పౌష్టికాహారం అని బలంగా నమ్మాడు. అందరికి అదే విషయాన్ని చెప్పాడు. 1980ల్లోనే రోజుకి 300 ఆమ్లెట్లు అమ్మేవాడు. ఇక 1982లో మ్యాగీని మార్కెట్ యాంగిల్‌లో అమ్మింది కూడా బండారీనే. ఇలా బండారి ఫేమస్ అయ్యారు. 51ఏళ్లుగా ఆమ్లెట్ వేస్తూనే ఉన్నారు. అలాంటి బండారీ ఇప్పుడు షాప్ క్లోజ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కస్టమర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.