కోలుకున్న వారినుంచి ఇతరులకు కరోనా సోకదు : కేంద్రం 

కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి కోలుకున్నాక వారినుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ బారినుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించే ప్లాస్

కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి కోలుకున్నాక వారినుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ బారినుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించే ప్లాస్మా ద్వారా మరింత మంది కరోనా బాధితులను రక్షించుకోవచ్చు. కోలుకున్న వారిని దూరంగా ఉంచరాదని, వారిపట్ల వివక్ష చూపడం తగదని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. దేశవ్యాప్తంగా వైరస్‌ బారినపడిన వారిలో 6,184 మంది కోలుకున్నారని పేర్కొంది. మొత్తం కేసులతో పోల్చితే కోలుకున్నవారు 22.17 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో 1,396 కొత్త వైరస్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 27,892కి, మొత్తం మరణాలు 872కి చేరినట్లు తెలిపింది.

గతంలో పాజిటివ్‌ కేసులున్న 16 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 25 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 85 జిల్లాల్లోనూ 14 రోజులుగా కొత్త వైరస్‌ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఆర్టీ PCR పరీక్షల కోసం ICMR వద్ద తగినన్ని కిట్లు ఉన్నాయని చెప్పారు. వైరస్‌ నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులు, శానిటైజర్‌ సిబ్బందిపై దాడులకు పాల్పడరాదని సూచించారు.

మనుషుల్లోని రోగ నిరోధక శక్తి ఒక్కటే కరోనా వైరస్‌ నుంచి కాపాడుతుందని  కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయుర్వేద ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించి అమ్మకాలను ప్రోత్సహించాలని కోరుతూ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. తులసి ఆకులు, దాల్చినచెక్క, ఎండు అల్లం పొడి, నల్ల మిరియాల మిశ్రమంతో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. ఈ మిశ్రమాన్ని ‘ఆయుష్‌ క్వాత్‌, ఆయుష్‌ కుదినీర్‌, ఆయుష్‌ జోషంద’ వంటి పేర్లతో విక్రయించాలని ఉత్పత్తిదారులకు రాసిన లేఖలో సూచించింది.