Delta Variant Infecting Fully Vaccinated People, Shows Growing Evidence
Delta Variant Fully-Vaccinated People : ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనావైరస్ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గత వేరియంట్ల కంటే ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచ దేశాల్లో డెల్టా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా టీకాలు తీసుకున్నవారిని కూడా డెల్టా వదలడం లేదు. పూర్తిగా రెండు డోసులు తీసుకున్నా కూడా సోకుతోంది. డెల్టా వ్యాప్తిపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించాల్సిన టీకాలతో కూడా డెల్టా వ్యాప్తిని కంట్రోల్ కాలేదని ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. భారతదేశంలో మొదట గుర్తించిన డెల్టా వేరియంట్ గురించి ప్రధాన ఆందోళన ఏమిటంటే.. అత్యంత వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
మునపటి వేరియంట్ల కంటే టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ఎక్కువగా సోకుతుందనడానికి ఆధారాలు పెరుగుతున్నాయి. వారికి తెలియకుండానే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టీకా రెండు డోసులు తర్వాత ఇన్‌ఫెక్షన్ సోకే సత్తా డెల్టాకు ఉందని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టా వేరియంట్ అంటూ సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ డెల్టా వేరియంట్‌ను ‘ఫిట్ అండ్ ఫాస్ట్’గా అభివర్ణించారు. డెల్టా దెబ్బకు వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు విధించాల్సి రావొచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీకాల ప్రభావం ఎంతంటే?
కరోనాపై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదిగా ఫైజర్ టీకాకు పేరుంది. అయితే ఈ ఫైజర్ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని గణాంకాల్లో తేలింది. డెల్టా వేరియంట్‌పై టీకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదన్న ఆందోళనలు, భయాలు వెంటాడుతున్నాయి.డెల్టా వ్యాప్తి పరిస్థితిని పరిశీలిస్తే అది నిజమేనన్న ఆందోళన కనిపిస్తోంది. బ్రిటన్‌లో డెల్టా సోకినవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారే ఉన్నారు. సింగపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారేనట. అమెరికాలో కొత్త కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ నుంచే రావడం నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాల్లో ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా వ్యాప్తి పెరిగిందని WHO హెచ్చరించింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ECDC) ఇలాంటి హెచ్చరికలు చేసింది. ప్రపంచమంతా డెల్టా ఆధిపత్య వేరియంట్ గా మారడానికి వారాలు పట్టదని అంటున్నారు. ఏ క్షణంలోనైనా డెల్టా మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర కొవిడ్ వేరియంట్లతో రోగి ముక్కులో వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ ఉంటుందని ఒక అధ్యయనం హెచ్చరించింది. అందుకే డెల్టా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. డెల్టా వ్యాప్తితో కరోనా వ్యాక్సినేషన్లపై ప్రజల్లో వ్యతిరేకత తలెత్తే అవకాశం లేకపోలేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.