Eye
Diabetes : షుగర్ వ్యాధి వచ్చిదంటే శరీరంలోని వివిధ భాగాలపై దాని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ముఖ్యంగా సున్నితమైన కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. షుగర్ తో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు తమ కంటి చూపు విషయంలో తేడాలను గమనిస్తుండాలి. సహజంగా వయస్సు పై బడిన వారిలో కంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అయితే షుగర్ తో బాధపడుతున్న వారిలో డయాబెటిక్ రెటినోపతీ సమస్య ఉత్పన్నమౌతుంది.
గ్లూకోమా, కాటారాక్ట్ త్వరగా వస్తాయి. వీటి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపినా చివరకు కంటి చూపునే కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి అవయవానికి పోషకాలు అందించే బాధ్యత రక్తానిది. రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహిస్తుంటుంది. ఈ నాళాల చివరన ఉండే అత్యంత సూక్ష్మమైన నాళాలను రక్తకేశనాళికలు అంటారు. దీర్ఘకాలంగా రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండేవారిలో ఈ రక్తకేశనాళికలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో చివర్లలో అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా ఆ అవయవానికి రక్తం అందకుండా పోతుంది. ఆసమయంలో అవయవం శాశ్వతంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. కంటిలో ఉండే రక్తనాళాల చివరల్లోనూ ఇలాంటి బ్లాక్స్ రావడం సంభవిస్తే చూపు దెబ్బతింటుంది.
డయాబెటీస్ సమస్యతో బాధపడేవారిలో ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ క్యాటరాక్ట్, గ్లకోమా నర్వ్ పాల్సీ ఆప్టిక్ న్యూరోపతి, కనురెప్పకు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్, కనురెప్పలు వాలిపోవడం, కంటిలోపల ఉండే పొర కంజెంక్టివాకు ఇన్ఫెక్షన్లు సోకటం వంటివి వెలుగు చూస్తాయి. డయాబెటీస్ ఉన్నవారిలో కంటి సమస్యలనేవి బ్లడ్ షుగర్ నియంత్రణతో ముడిపడి ఉంటాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటే గణనీయంగా కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. తద్వారా కళ్ళను దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. వైద్యుల సూచనలను పాటిస్తూ తగిన వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ కంటి షుగర్ ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. మద్యం, పొగ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం ఉత్తమం.