Immunity : శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గటానికి కారణాలు తెలుసా ?

చాలా మంది చక్కెరతో తయారైన తీపి పదార్ధాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అధిక మోతాదులో లాగించేస్తుంటారు. ఇలా తింటే డయాబెటిస్ రావటంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి.

Do you know the causes of reduced immunity in the body?

Immunity : మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు రోగ నిరోధక శక్తి ఎంతగానో దోహదపడుతుంది. ఇది ఎక్కువగా ఉంటే రోగాలు దరిచేరవు. రోగనిరోధక శక్తి ఏమాత్రం తగ్గినా తరచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి బలహీనమవడానికి కారణం కొన్ని చెడు అలవాట్లు కావచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుందన్న దానిపై ప్రతిఒక్కరు అవగాహాన కలిగి ఉండటం మంచిది.

రోగనిరోధక శక్తి తగ్గటానికి కారణాలు ;

1. అధికంగా మద్యం సేవించటం ; అనునిత్యం మద్యం సేవించేవారిలో కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా క్రమేపి తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. మద్యం ఎక్కువగా తాగటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి న్యూమోనియా వంటివి శ్వాస సంబంధిత జబ్బులు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మద్యం సేవించే అలవాటును మానుకోవాలి.

2. ఉప్పు అధికంగా వాడటం ; ఆహార పదార్ధాల్లో ఉప్పు వాడకం అధికం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మసాల వంటకాల్లో ఉప్పు అధికంగా వాడుతుంటారు. ఉప్పు ఎక్కువ మొత్తంలో వాడితే రక్తపోటు పెరుగుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీరంలో అధిక సోడియం మూత్రపిండాల పై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్ధ్యాన్ని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.

3. తీపి పదార్ధాలు అధికమైనా ; చాలా మంది చక్కెరతో తయారైన తీపి పదార్ధాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అధిక మోతాదులో లాగించేస్తుంటారు. ఇలా తింటే డయాబెటిస్ రావటంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. అధిక మోతాదులో చక్కెర వినియోగిస్తే రోగనిరోధక కణాల పనితీరు సామర్ధ్యం తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి చక్కెర కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది.

4. కాఫీ, టీలో రోగనిరోధక శక్తిపై ప్రభావం ; కాఫీ, టీలు తాగటం వల్ల మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ వాటిని రోజుమొత్తంలో ఒకటి, రెండుకు మాత్రమే పరిమితం చేయాలి. ఎక్కువ మోతాదులో తాగితే నిద్రలేమి సమస్యలు వస్తాయి. నిద్రలేమి సమస్య వస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

5. జంక్ ఫుడ్ తింటే ; పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. ఇవి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తాయి. ఊబకాయం సమస్యకు దారి తీస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

6. ఒత్తిడి ; ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడితో జీవితాన్ని గడుపుతున్నారు. ఒత్తిడి కారణంగా జీర్ణక్రియ , శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటంతోపాటు, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.