Food
Best Food : ప్రస్తుత బిజీ యుగంలో అందరిది ఉరుకులపరుగుల జీవతమైపోయింది. సమయానికి తిండితిప్పలు లేకుండా ఆఫీసుల్లో ఉద్యోగాలే జీవితం అన్న చందంగా పనిచేస్తున్నారు. ఎలాంటి శరీరక శ్రమలేకపోయినా మెదడుకు మాత్రం పనిచెప్పక తప్పదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మొదలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, నిత్యం కుర్చీలకే పరిమితమై తన విధినిర్వాహణను కొనసాగిస్తుంటారు. రోజుకు 10 గంటలపాటు అంతే కంప్యూటర్లు, ల్యాప్ ట్యాపులకు అతుక్కుపోతారు. తాము ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న శ్రద్ధ ఏమాత్రం వారిలో కనిపించదు.
ఇలాంటి వారు ముఖ్యంగా తీసుకునే ఆహారంపై దృష్టిసారించాలి. ఎందుకంటే పనిధ్యాసలో పడిపోయి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే కోరి వ్యాధులను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగపనుల్లో పడి తినే తిండిపై దృష్టిపెట్టకపోతే గుండెజబ్బులు, బిపీ, షుగర్, నరాలసమస్యలు ఇలాంటి వాటి బారిన పడాల్సి వస్తుంది. ఆఫీసు ఉద్యోగాలు చేసుకునే వారికి కొన్ని రకాల ఆహార పదర్ధాలు చక్కని మేలు చేస్తాయి. అలా వారు తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం..
ఆఫీసులకు వెళ్ళే వారు మధ్య మధ్యలో పండ్లు తీసుకోవటం చాలా అవసరం . నీరసం రాకుండా రోజంతా పనిచేస్తూ అలసి పోకుండా ఉండేందుకు మధ్య మధ్యలో పండ్లు తీసుకుంటూ ఉండాలి. ఆపిల్స్, ద్రాక్ష, జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ, కమల వంటి పండ్లను ఇంటి నుండి ఓ బాక్సులో తెచ్చుకుని ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో రెండు గంటలకు ఓ పర్యాయం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలుకలుగుతుంది.
కార్యాలయంలో ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్య మధ్యలో గ్రీన్ టీ తీసుకోవటం మంచిది. ఇందులో అధికశాతం ఉండే పాలిఫెనాల్స్ శరీరానికి బాగా ఉపయోగపడతాయి. రోగ నిరోధక వ్యవస్ధ పెంపొందేందుకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. అధిక మొత్తంలో కాకుండా రెండు మూడు కప్పుల గ్రీన్ టి త్రాగటం మంచిది.
స్నాక్స్గ్ లో భాగంగా పాప్ కార్న్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ తోపాటు, యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతంలో లభిస్తాయి. ఇంట్లోనే వీటిని ముందుగానే తయారు చేసుకుని మెత్తబడకుండా ప్యాక్ చేసుకుని ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తీసుకువెళితే బాగుంటుంది. లేదంటే కార్యాలయ వద్ద క్యాంటిన్లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.
అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ లు తీసుకోవటం చాలా మంచిది. పని వత్తిడిని తగ్గించేందుకు ఇవి ఎంతగానో తోడ్పతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నిరోధించటంతోపాటు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. రోజుకొక చిన్నసైజు డార్క్ చాక్లెట్ తింటే మానసికంగా ఉత్తేజంగా ఉండటంతోపాటు, రక్తపోటు వంటి సమస్యలు దూరమౌతాయి. పనిమీద ఏకాగ్రతకూడా పెరుగుతుంది.
డ్రైఫూట్స్ తీసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే వాటిలో అక్రూట్లు తినటం చాలా ఉత్తమం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చూస్తాయి. ప్రతిరోజు ఏడెనిమిది అక్రూట్ పప్పులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.