Late Night Eating : రాత్రి ఆహారం ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారా?

దీని వల్ల పరిమితికి మించి ఆహారం శరీర బరువుకు కారణమౌతుంది. కాబట్టి రాత్రి వేళ ఆలస్యంగా తింటున్నా, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.

Night Eating

Late Night Eating : అధిక బరువు అనేది ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిపోయింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువుతో బాధపడుతున్నారు. నిద్రలేమి, పని ఒత్తిడి వంటివి సైతం ఈ సమస్యకు కారణమౌతున్నాయి. తినే ఆహారం విషయంలో సరైన వేళలు పాటించక పోవటం వల్ల కూడా ఊబకాయం, అధిక బరువు సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉండేవారిలో బరువు పెరిగే సమస్య అధికంగా ఉంటుంది.

వాస్తవానికి రాత్రి వేళ ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారన్న ప్రచారం సరైనది కాకపోయినప్పటికీ రాత్రి తినే అధిక కేలరీల ఆహార పదార్థాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఉండే సుదీర్ఘమైన వ్యవధి మూలంగా ఆకలి పెరిగి, అవసరానికి మించి, కొంత ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. అవసరానికి మించిన క్యాలరీలు శరీరంలోకి చేరుకుని శరీర బరువు పెరగటానికి కారణమౌతుంది. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. భోజనాన్ని ఎంచుకునే విషయంలో ఎక్కువ మంది పొరపాట్లు చేయటం వల్లే అధిక బరువు పెరగటం అన్నది జరుగుతుంది. రాత్రిపూట ఎక్కువ ఆహారం తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, నిద్రకు ముందు ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఒత్తిడి, ఆందోళనలు సైతం తినే ఆహారంపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. పగలంతా వివిధ రకాల కార్యకలాపాల్లో ఒత్తిడి తో ఉండి రాత్రి వేళ ఆహారం తీసుకునే సమయంలో ఎంత తింటున్నామో తెలికుండానే అధిక మొత్తంలో ఆహారాన్ని తినేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల పరిమితికి మించి ఆహారం శరీర బరువుకు కారణమౌతుంది. కాబట్టి రాత్రి వేళ ఆలస్యంగా తింటున్నా, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. వీలైనంత వరకు నిద్రకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవటం మంచిది. దీని వల్ల జీర్ణక్రియలు సాఫీగా ఉంటాయి. తిన్నతరువాత నేరుగా బెడ్ పైకి చేరకుండా కొంత సేపు తేలిక పాటి వాకింగ్ వంటి వ్యాయామాలు చేయటం మంచిది. రాత్రి సమయంలో తీపి ఎక్కువగా ఉండే స్వీట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిని తినకూడదు.