Wrinkles On The Skin
Wrinkles : ఇటీవలి కాలంలో తక్కువ వయస్సులోనే చర్మం ముడతలు పడిపోయి చాలా మంది వృద్ధాప్య ఛాయలతో కనిపించటం సర్వసాధారణంగా మారింది. చర్మంపై ముడతలు ఏర్పడటానికి జీవనశైలిలో మార్పులు, వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, వంటి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజు వారిగీ చేసే పొరపాట్ల కారణంగానే చిన్నవయస్సులోనే చర్మం ముడతలు ఏర్పడుతున్నాయి.
చక్కెరను అధికంగా తీసుకునే వారిలో చర్మంపై ముడతలు ఏర్పడటానికి అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తగిన మోతాదులో చక్కెరను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరమే అయినప్పటికీ చాలా మంది మోతాదుకు మించి చక్కెరను ఉపయోగిస్తుండటం చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ మొదలై చర్మం మృదుత్వాన్ని దెబ్బతినేలా చేస్తుంది. దీంతో ముడతలు పడడం జరుగుతుంది.
చర్మం అందంగా, మృదువుగా కనిపించడానికి తగు పరిమాణంలో కొవ్వులు అవసరమన్న విషయం తెలుసుకోవాలి. శరీరంలో కొవ్వులు పేరుకుంటాయన్న భయంతో చాలా మంది కొన్ని రకాల కొవ్వు ఆహారాలకు దూరంగా ఉంటారు. వాస్తవానికి ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. చర్మానికి మేలు చేస్తాయి. అందుకే కొవ్వు పదార్థాలను అవసరమైన మేర తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు నాణ్యమైన మాయిశ్చురైజర్లను వాడుకోవటం వల్ల చర్మంపై ముడతలు లేకుండా కాపాడుకోవచ్చు. చర్మానికి సరిపడే క్రీములను వాడుకోవాలి.
అంతేకాకుండా స్నానానికి ఉపయోగించే సబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్లో కొత్త సబ్బులు వస్తే చాలా వెంటనే వాటిని కొనుగోలు చేసి వాడేస్తుంటారు. అయితే అవి శరీరానికి సరిపడుతున్నాయో లేదో ఏమాత్రం ఆలోచించరు. ఇలా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో సబ్బులు సరిపడక చర్మం పొడిబారిపోయి ముడతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సౌందర్య నిపుణుల సూచనలు, చర్మ నిపుణులను సంప్రదించి సబ్బులను వాడుకోవటం మంచిది. ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. చాలామంది చెంపలను దిండుకు ఆనించి నిద్రపోతుంటారు. అలా కాకుండా తలను ఆన్చి నిద్రపోవాలి. ఎందుకంటే తలగడ వల్ల ముఖ చర్మానికి ఒత్తిడికి గురై ముడతలు పడే అవకాశం ఉంటుంది.
కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్ ను వాడటం వల్ల సైతం చర్మంపై ముడతలు ఏర్పడతాయి. రాత్రి నిద్రించే ముందే మేకప్ తీయకుండానే పడుకోవడం వల్ల సమస్య ఉత్పన్నం అవుతుంది. ముఖం అందంకోసం అదేపనిగా ఫేస్ వాష్ చేయటం వల్ల కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పదేపదే ఫేస్ వాష్ చేయటం వంటివి చేయకూడదు. నిద్రలేమి వల్ల కూడా ముఖ చర్మంలో మార్పులు వస్తాయి. నీరు తీసుకోని వాళ్ళల్లో సైతం చర్మం ముడతులు పడుతుంది.
చర్మంపై ముడతలకు పోషకాహార లోపం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు లేకపోవటం వల్ల చర్మంపై ముడతలు, పొడిగా మారటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇందుకోసం పోషకాహారాలైన బ్రకోలి, టమోటాలు, డార్క్ చాక్లెట్ , పండ్లు, వంటి వాటిని తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.