Donkey Milk
Donkey Milk : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్న మాట పాతది.. ప్రస్తుతం గాడిద పాలు గరిటెడైనను చాలు అన్న పదం కొత్త మాట…ప్రస్తుతం గాడిద పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గాడిద పాలు ఔషద లక్షణాలు కలిగి ఉండటమే ఇందుకు కారణం. పలు పరిశోధనల్లో గాడిదలపాలల్లో అనేక పోషక విలువలు ఉన్నట్లు తేలటంతో పాలకు మంచి గిరాకీ లభిస్తోంది.
చిన్నపిల్లల్లో ఉబ్బసం, నెమ్ము వంటి సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారం. గాడిదపాలు తాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లీటరు గాడిద పాల ధర 2వేల రూపాయల వరకు పలుకుతుందంటే ఆశ్ఛర్యం వేయకమానదు. ఇప్పటికే మార్కెట్లోకి అనేక కంపెనీలు గాడిద పాలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను విక్రయాలు చేపట్టాయి. తల్లిపాలల్లో ఉండే పోషక విలువలు గాడిద పాలల్లో ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేల్చారు. కొవ్వు శాతం గాడిద పాలల్లో చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గటంతోపాటు స్ధూలకాయం నుండి బయటపడాలంటే గాడిదపాలు శ్రేయస్కరమని పరిశోధకులు సూచిస్తున్నారు.
పెద్ద వయస్సు వారికి ఈ పాలు బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. గాడిద పాలలో యాంటీ కేన్సర్ లక్షణాలు ఉన్నాయి. లైంగింక సామర్ధ్యాన్ని పెంచటంలో బాగా పనిచేస్తాయని లక్నో యూనివర్శిటీ పరిశోధకులు ఇప్పటికే ప్రకటించారు. విటమిన్ సి, బి, డి12 ,ఇ వంటి విటమిన్లు గాడిద పాలలో పుష్కలంగా ఉన్నాయి. ఆవుపాలతో పోలిస్తే గాడిద పాలలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. గాడిద పాలల్లో ఉండే పోషకాలను గుర్తించి ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, సెర్బియా, బోస్నియా వంటి దేశాలు పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమను ప్రోత్సాహిస్తున్నాయి.
యూరోపియన్ దేశాల్లో గాడిద పాలతో తయారు చేసే చీజ్ అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు. కిలో ధర ప్రపంచ మార్కెట్లో 85వేలు పలుకుతుంది. గాడిద పాలు తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చా అన్న కోణంలో శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఎక్కువ కాలం జీవించేందుకు శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పాలల్లో లభిస్తున్నట్లు గుర్తించారు.
గాడిద పాలలోని పోషకాల ప్రాధాన్యతకు సంబంధించి ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లతో పాటు న్యూట్రిన్లు ఉంటాయి. చంటి పిల్లలకు గాడిదపాలు తాగించటం ద్వారా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు దరి చేరవు. ఆయుర్వేదంలో గాడిదపాలను క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధులకు వినియోగిస్తున్నారు.
గాడిద పాలలో ప్రొటీన్లు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. అలాగే మినరల్స్, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. అలెర్జీ సంబంధిత రుగ్మతలను నయం చేసే గుణం గాడిదపాలలో ఉంది. పిల్లల ఎముకలు శక్తివంతం కావాలంటే ఈ పాలు బాగా ఉపకరిస్తాయి. విరిగిన ఎముకలను సైతం త్వరగా అతుక్కునేలా చేసే స్వభావం గాడిపాలు కలిగి ఉంది.