Father Make Medicine : ఆ చిన్నారికి వింత వ్యాధి.. పసిప్రాణం కాపాడేందుకు మందు కనిపెట్టిన తండ్రి..!

ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు.

Father Makes Medicine : ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు. కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, కన్నతండ్రి మాత్రం ఎలాగైనా ఆ చిన్నారిని బతికించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ క్షణంలోనైనా పసిప్రాణం పోయే పరిస్థితి. కళ్ల ముందే ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారిని చూసి కన్నతండ్రి హృదయం విలవిలలాడింది. చిన్నారిని కాపాడుకునేందుకు తిరగని ప్రదేశం లేదు. కొడుకును కాపాడమంటూ వైద్యుల కాళ్లవేళ్లా పడ్డాడు. ఎక్కడికి వెళ్లినా ఒకటే సమాధానం.. ఈ అరుదైన వ్యాధికి మందు లేదు.. మేం ఏం చేయలేం అంటూ డాక్టర్లు చేతులేత్తేశారు. ప్రతి లక్ష మంది చిన్నారుల్లో ఒకరికి అరుదుగా వస్తుందంట ఈ మాయదారి వ్యాధి. సరైన చికిత్స అందితే తప్పా బతికే ఛాన్స్ లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఆ పసిప్రాణం నిలబడదు.. ఆ అద్భుతమేదో తానెందుకు చేయొద్దని ప్రశ్నించుకున్నాడు.. అసలు ఈ వ్యాధి ఏంటి? ఎలా ఎదుర్కోవాలో రీసెర్చ్ చేశాడు. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా చేశాడు. చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక చివరికి తానే వైద్యుడిలా మారాడు.

చైనాలోని కన్‌మింగ్ ప్రాంతానికి చెందిన 30ఏళ్ల గ్జువీ (Xu)కి 2ఏళ్ల వయస్సున్న కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి పేరు హావోయాంగ్ ( (Haoyang). ఆ పిల్లాడు జన్యుపరంగా అరుదైన మెంకెస్ సిండ్రోమ్ (Menkes Syndrome) బారినపడ్డాడు. మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు క్షీణించింది. శరీరంలో కాపర్ (copper) లోపంతో ఈ సమస్య తలెత్తుతుంది.. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు మూడేళ్లకంటే ఎక్కువ కాలం బతకడం అసాధ్యం. వ్యాధిని పూర్తిగా నయం చేయలేరు కూడా. అయితే వ్యాధి లక్షణాలు ముదరకుండా ఉండేందుకు మెడిషన్స్ మాత్రం వాడొచ్చు. ఆ మందులేమో చైనాలో దొరకడం లేదు. అందులోనూ కరోనా ఆంక్షలు దేశం దాటి వెళ్లే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి.. కన్నకొడుకును ఎలా కాపాడుకోవాలి? ఆ తండ్రిని ఆలోచనలో పడేశాయి.

ఇంట్లోనే ల్యాబ్.. మందు కోసం రీసెర్చ్ :
కన్నకొడుకును కాపాడుకునేందుకు గ్జువీనే సొంతంగా మందు తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో ల్యాబ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దగా చదువుకోని గ్జువీ.. మెంకెస్‌ సిండ్రోమ్‌ (Menkes Syndrome) గురించి రీసెర్చ్‌ మొదలుపెట్టాడు.. అతడికి ఇంగ్లీష్‌ రాదు.. గూగుల్ ట్రాన్సలేటర్లను వినియోగించుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఈ వ్యాధి గురించి తెగ వెతికాడు.. ఎలాంటి చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నాడు. ఇంతకీ ఆ మందుల తయారీకి ఏం కావాలి, అందులో ఏం ఉపయోగిస్తారు.. ఇలా ప్రతి ఒక్కదానిపై రీసెర్చ్ ప్రారంభించాడు. ఏదోలా అవగాహన సంపాదించుకున్నాడు. తండ్రి జిమ్‌లోనే ల్యాబ్ ఏర్పాటు చేసిన అతడు.. వ్యాధి నివారణకు అవసరమయ్యే కాపర్ హిస్టిడైన్ (copper histadine) గురించి తెలుసుకున్నాడు. ఆ మందు తయారీకి ఒక డివైజ్ కూడా రూపొందించాడు.

ముందుగా ఎలకలపై ప్రయోగం.. ఆపై తనకే ఎక్కించుకున్నాడు : 
సరిగ్గా ఆరు వారాల తర్వాత గ్జువీ మొదటి మందును రెడీ చేశాడు. ఆ మందును తొలుత ఎలుకల మీద, కుందేలు మీద ప్రయోగించాడు. అది బాగా పనిచేసింది. కానీ, తన చిన్నారికి ఇచ్చేందుకు అతడికి భయమేసింది. తండ్రి మనస్సు అంగీకరించలేదు. ప్రాణానికి ప్రమాదమని భావించాడు. ఈ మందు పనిచేస్తుందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకున్నాడు. చేసేది ఏమిలేక తనకే ఏకంగా మందును ఎక్కించుకున్నాడు. అదృష్టవశాత్తూ అతడికి ఏమీ కాలేదు. అదే ధైర్యంతో ఆ చిన్నారికి కూడా మెడిసిన్ ఇచ్చాడు. అనంతరం చేసిన టెస్టుల్లో రిపోర్ట్స్‌ నార్మల్‌గా వచ్చేశాయి. గ్జువీ ఆనందానికి అవధుల్లేవు.. కొడుకును పట్టిపీడుస్తున్న ఆ మాయదారి వ్యాధిపై తండ్రి ప్రేమే గెలిచింది. ఆ తండ్రి పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కింది.

మెంకెస్ సిండ్రోమ్‌పై పరిశోధన.. త్వరలో క్లినికల్ ట్రయల్స్ :
ఆ పసి హృదయం.. నేను బాగానే ఉన్నాను నాన్న.. అని చెప్పలేదు.. కానీ, పసిబాలుడి చిరునవ్వు చూసి ఆ తండ్రి మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఇక్కడితే తన ప్రయత్నాన్ని ముగించలేదు. తనకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగపర్చు కోవాలనుకున్నాడు. ఇప్పుడు మాలిక్యులార్ బయోలజీ చదివేందుకు రెడీ అయ్యాడు. తన కుమారుడి మరణం గురించి భయపడే పరిస్థితి ఉండొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఆ దిశగా తన పరిశోధన కొనసాగించాడు. ఇదిలా ఉండగా.. వెక్టర్ బిల్డర్ అనే అంతర్జాతీయ బయోటెక్ ల్యాబ్… గ్జువీ నిర్వహిస్తోన్న పరిశోధనపై ఆసక్తి కనబర్చింది. మెంకెస్ సిండ్రోమ్‌పై ఆయనతో కలిసి పరిశోధన చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. ఏదిఏమైనా కన్న కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు తండ్రి చేసిన సాహసోపేత నిర్ణయానికి నివ్వెరపోయినా ప్రపంచమంతా ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతోంది.

Read Also : Kerala Mother : అమ్మ ప్రేమ గెలిచింది..ఆ బిడ్డ అనుపమ బిడ్డే

ట్రెండింగ్ వార్తలు