First Nasal Vaccine Developed By Bharat Biotech
First Nasal Vaccine : కరోనావైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాలో మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (Nasal Vaccine) క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి లభించినట్టు సంస్థ శుక్రవారం (ఆగస్టు 13) ఒక ప్రకటనలో వెల్లడించింది. 18ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సు వారిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే టీకా (BBV154- అడినోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్) అందుబాటులోకి తీసుకురానుంది.
ఇదివరకే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ముక్కు ద్వారా ఇచ్చే టీకా కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని ఇదివరకే జంతువులపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది.