Black Pepper, Turmeric
Turmeric And Pepper : ఆయుర్వేదంలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వకాలం నుండి మన పెద్దలు మిరియాలను వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వివిధ వ్యాధుల నివారణకు వీటిని వాడుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉండటం వల్లే వీటికి అంతటి ప్రాధాన్యతను ఇచ్చేవారు. మిరియాల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, పీచు, కాల్షియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు కూడా ఉంటాయి. మిరియాల్లోని పిపరైన్, చావిసైన్‌లు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. కేవలం జలుబు, దగ్గుకు మాత్రమే కాదు జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు సహాయపడతాయి.
అదేసమయంలో పసుపు లో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. పసుపును సైతం నిత్యం వంటల్లో వినియోగిస్తారు. ఎందుకంటే పసుపు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. నిరంతరాయంగా వేధించే దగ్గు, జలుబు, గొంతు నొప్పులకు పసుపు పాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి. పసుపులో యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ గుణాలుంటాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి.
అధిక బరువు, కీళ్లవాతం, గ్యాస్ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా మిరియాల పొడి, నెయ్యి కలిపి రాస్తే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. గొంతులో గరగరగా ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి, ఒక చెంచా తేనె కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతాయి.
మిరియాలు చర్మంపై వచ్చే తెల్లటి మచ్చల్ని తగ్గించడానికి తోడ్పడుతాయని పరిశోధనలో తేలింది. చర్మంపై ఏర్పడే బొల్లి మచ్చల్ని మిరియాలు తగ్గిస్తాయని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్ధారించారు. మిరియాల్లో ఘాటుకు కారణమైన పైపెరైన్ అనే రసాయన సమ్మేళనం చర్మ కణాల్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల రంగు మారేలా చేస్తుందని ఈ పరిశోధనలో నిర్ధారించారు. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. గాయాలపై మిరియాల పొడిని పూస్తే యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి రక్తస్రావాన్ని అరికడుతుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం తామర, సోరియాసిస్ తోపాటు ఇతర చర్మ సమస్యలను నివారించటంలో సహాయపడుతుంది. చర్మ సమస్యల చికిత్సకు సహాయపడే రోగ నిరోధక లక్షణాలు పసుపులో ఉన్నాయి. చర్మంలో కొల్లాజెన్, తేమ స్థాయిని సమతౌల్యం చేసేందుకు సహాయపడుతుంది. అదే విధంగా వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలను సైతం చర్మం నుంచి బయటకు పంపిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ నల్ల మచ్చలు మరియు మొటిమలను కలగజేసే ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.
ప్రతిరోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పుసుపు, మిరియాల పొడి కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉండటంతోపాటు గుండె సమస్యలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడి తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ రెండు రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో బాగా సహాయపడతాయి.