దేశ రాజధాని ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయి కాల్యుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు సరి-బేసి స్కీమ్ కూడా తీసుకొచ్చింది . నగరం బయట ప్రాంతాల్లో గడ్డిదుబ్బలను కాల్చడం కారణంగా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది.
ఢిల్లీ రాష్ట్ర శివారు ప్రాంతాల్లో గడ్డిదుబ్బలను కాల్చేయడాన్ని బ్యాన్ చేస్తూ ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించి గాలి నాణ్యతను మెరుగుపర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేక పోతున్నాయని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కాలుష్యంపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా సుప్రీం తోసిపుచ్చింది. కాలుష్య సమస్యను గాలికి వదిలేసి, రాజకీయాలంటూ బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోందని ధర్మాసనం కేంద్రంపై అక్షింతలేసింది.
‘ప్రపంచం మనల్నీ చూసి నవ్వుతోంది. కాలుష్యంతో నగర ప్రజల జీవన ఆయుర్థాయాలను తగ్గిస్తున్నారు. ఎందుకు జనాన్ని గ్యాస్ చాంబర్ల మధ్యలో జీవించేలా ఫోర్స్ చేస్తున్నారు. ఇంతకంటే.. సంచుల్లో15 బాంబులు తెచ్చి ఒకేసారి జనాన్ని చంపేయడమే మంచిది’ జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తరపున కోర్టులో వాదించిన రెండో సీనియర్ న్యాయాధికారి తుషార్ మెహతాతో పై విధంగా బెంచ్ పేర్కొంది.
గతనెలలోనే ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం తగిన స్థాయిలో చర్యలు చేపట్టలేదని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే హర్యాణా సరిహద్దు ప్రాంతాల్లో గాలి కాలుష్యానికి సంబంధించి సమీక్షలు జరిపినట్టు కేంద్రం కోర్టుకు విన్నవించింది.
పంజాబ్ లో సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారంటే అర్థం.. ఒక NCRలో ఉండే ప్రజలు మాత్రమే కేన్సర్ వంటి జబ్బులతో చనిపోవాలనా మీరు చెప్పేది అని కోర్టు చివాట్లు పెట్టింది. హర్యాణా శివారు ప్రాంతాల్లో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలపై కోర్టు సంతృప్తిగా లేదని జస్టీస్ అరుణ్ మిశ్రా తెలిపారు.