Dandruff
Dandruff : జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లబడటం లాంటి సమస్యలతోపాటు చాలామందిలో కనిపించే మరో సమస్య చుండ్రు. చుండ్రు లేదా డాండ్రఫ్ ఇది ఒకరకమైన చర్మవ్యాధి. తలపై చుండ్రు పేరుకుపోవడం వల్ల చిరాకు కలుగుతుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది. డాండ్రఫ్ సమస్య ఉన్నవాళ్లకు చికాకుగా, తరచూ తల దురదపెడుతూ ఉంటుంది. జీవనవిధానంలో మార్పులు, అధిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యంతో పాటు అనేక కారణాల వల్ల చుండ్రుసమస్య వస్తుంది. చుండ్రును అశ్రద్ధ చేస్తే హెయిర్‌ఫాల్ అధికంగా అయి బట్టతల వచ్చే అవకాశముంది. పోషకాహార లోపం కారణంగా కూడా చుండ్రుసమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
చుండ్రు లక్షణాలకు సంబంధించి జుట్టు రాలిపోవటం, జుట్టు రంగు డల్ గా మారటం, మలబద్దకం, పొలుసుల చర్మం, ఛాతీపై దద్దుర్లు, తల దురదగా ఉండడం, తలమీద ఎరుపు రంగు రావడం, చెవి తామర, నెత్తిమీద తెల్లటి రేకులు, జిడ్డు చర్మం, కనుబొమ్మ , కనురెప్ప, గడ్డంలో దద్దుర్లు, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తుల రియాక్షన్స్ కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంది. అధిక జిడ్డుగల చర్మం కలవారిలో సైతం ఈ చుండ్రు సమస్య తలెత్తుతుంది. సెబమ్ అధిక ఉత్పత్తి, పొడి బారిన చర్మం కూడా ఇందుకు కారణం అవుతాయి.
చుండ్రు నివారణ చర్యలకు సంబంధించి తలపై చర్మం విషయంలో సంరక్షణ చేపట్టాలి. మూలికల నూనెలను తలకు పట్టించటంతోపాటు, తరచూ తలస్నానం చేయటం వంటి పద్దతులను పాటించాలి. జుట్టును దువ్వెనతో గట్టిగా దువ్వరాదు. జుట్టును నీటితో కడగాలి. డ్రై షాంపూల జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడాలి. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది. కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. తలస్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.