HMPV Outbreak : చైనాను బెంబేలిత్తిస్తున్న కొత్త వైరస్.. హెచ్ఎంపీవీతో భారత్ అప్రమత్తం.. పెద్దగా ముప్పేమి లేదు : ఎన్సీడీసీ

HMPV Outbreak : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్‌సీడీసీ వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది.

HMPV outbreak in China poses no major threat

HMPV Outbreak : డ్రాగన్ చైనాను హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వణికిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19 మహమ్మారి మాదిరిగానే ఈ కొత్త హెచ్ఎంపీవీ డేంజరస్ వైరస్‌ చైనాలో తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) దేశంలోని శ్వాసకోశ, సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. రాబోయే వైరస్‌పై మరింత దృష్టిసారించాల్సిందిగా ఎన్‌సీడీసీని కేంద్రం ఆదేశించింది.

Read Also : HMVP Virus : చైనాను వణికిస్తున్న మరో మహమ్మారి..! HMVP వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?

అంతేకాదు.. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ హెల్త్‌ ఏజెన్సీలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్‌సీడీసీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రభావం లేదని, ఇప్పటివరకూ ఈ హెచ్ఎంపీవీ వైరస్ జాడ ఎక్కడా కనిపించలేదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

“మేం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడం, సమాచారాన్ని ధృవీకరించడంతో పాటు తదనుగుణంగా అప్‌డేట్ చేయడం కొనసాగిస్తాం” అని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తికి సంబంధించిన నివేదికలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

డిసెంబర్ డేటా ప్రకారం :
“డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 నుంచి వచ్చిన డేటాలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (hMPV)తో సహా తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో ఇటీవలి పెరుగుదలను సూచిస్తుంది. అయినప్పటికీ, చైనాలో శ్వాసకోశ అంటు వ్యాధుల మొత్తం స్థాయి తీవ్రత ఈ సంవత్సరం గత ఏడాది కన్నా తక్కువగానే ఉంది.

ఉత్తర అర్ధగోళంలో ముఖ్యంగా శీతాకాలంలో చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందడం, వ్యాప్తిని అరికట్టడానికి నిఘాతో పాటు ముందస్తుగా గుర్తించే విధానాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సీఈఓ డాక్టర్ అర్జున్ డాంగ్ అన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సాధారణంగా ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటుందని, వైరస్ వ్యాప్తి త్వరగా నియంత్రించకపోతే అది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని డాక్టర్ డాంగ్ హెచ్చరించారు.

శ్వాసకోస వైరస్ లక్షణాల మాదిరిగానే :
“హెచ్ఎంపీవీ సాధారణంగా జ్వరం, దగ్గు, నాసికా రద్దీ, శ్వాససమస్యలు, గురకలతో సహా ఇతర శ్వాసకోశ వైరస్‌లకు సమానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ వ్యాప్తితో తీవ్రమైన కేసులు బ్రోన్కియోలిటిస్ లేదా న్యుమోనియాకు దారి తీయవచ్చు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూపులో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాప్తిని త్వరగా అరికట్టకపోతే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్రభారం పడుతుందని డాక్టర్ అర్జున్ డాంగ్ పేర్కొన్నారు. “హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణకు పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్ష ప్రమాణం” అని డాక్టర్ డాంగ్ తెలిపారు.

నో యాంటీవైరల్ ట్రీట్‌మెంట్.. నివారణ ఒక్కటే మార్గం :
డాక్టర్ అర్జున్ డాంగ్ మాట్లాడుతూ.. హెచ్ఎంపీవీకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నివారణ ఒక్కటే మార్గం. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గుతున్నప్పుడు నోటికి మోచేతి అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం వంటి సాధారణ చర్యలు వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి ఆయా లక్షణాల్లో తేడాలు ఉంటాయి. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ సులభంగా వ్యాప్తిచెందుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్‌ తీవ్రప్రభావం ఉంటుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Read Also : China HMPV Deadly Virus : కోవిడ్ తర్వాత ఐదేళ్లకు చైనాలో మరో డేంజరస్ వైరస్ విజృంభణ.. నిండిపోతున్న ఆస్పత్రులు..!