constipation problem
Constipation Problem : మలబద్ధకం ప్రస్తుతం సాధారణ సమస్యగా మారిపోయింది. ఆయిల్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్ తినడం, నిద్రలేకపోవడం వంటి ఇతర కారణాల వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పుల్లని త్రేన్పులు వస్తుంటాయి. నిద్రపట్టదు. కూర్చోలేం. కడుపులో చాలా ఇబ్బందిగా ఉంటుంది.
కడుపు ఉబ్బరం, మలబద్ధకం అనేవి రెండు దగ్గరి సంబంధాన్నే కలిగి ఉంటాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పెనుముప్పు తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్ర ఒత్తిడితో విరేచనం అవ్వడం, మల ద్వారంపై ఒత్తిడి పెట్టడం వల్ల పగుళ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండు సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.
మలబద్దకానికి ఇంటి చిట్కాలు ;
మలబద్ధకం ఉన్నవారు చిలగడ దుంపల్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. వీటితో పాటు పెరుగు, చియా సీడ్స్ వంటి ప్రో బయోటిక్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలతో జీర్ణ సమస్యలు దూరమౌతాయి. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
అరటి పండు జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. ఫైబర్‌తో నిండి ఉన్న అరటిపండు మన పేగు కదలికల్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే పొటాషియం, సోడియం ఎక్కువగా తీసుకునే ఫుడ్స్‌తో వచ్చే కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తుంది. అరటిపండుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయండి. దీనిపై నల్లమిరియాల పొడి, ఉప్పు చిటికెడు చల్లి రోజువారిగా తింటే మలబద్ధకం దూరమవుతుంది. అయితే అరటిపండు పచ్చిగా తీసుకోకపోవటమే మంచిది.
హెర్బల్ టీలు మలబద్ధకాన్ని దూరం చేయటంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేసి మలబద్దకం రాకుండా కాపాడతాయి. వీటితో పాటు పెరుగు తీసుకోవడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. శరీరంలో నీటి శాతం తక్కువ అయినా మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.
గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. రోజువారిగా వ్యాయామం చేయాలి. నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగిన వెంటనే పెద్దపేగు రిఫ్లెక్స్ హిట్‌ను పొందుతుంది. దీనిని గ్యాస్ట్రో-కోలిక్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఇది మలాన్ని బయటకు నెట్టివేస్తుంది.