Hyperthermia : శరీరంలో వేడి ఎలా పుడుతుంది? హఠాత్తుగా ఎందుకు పెరుగుతుంది?

శరీరంలో వేడి చేసినప్పుడు ఎక్కువగా పంచదార నీళ్లను, సగ్గు బియ్యం పాయసాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి నీటిని ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే.

Hyperthermia

Hyperthermia : మనిషి శరీరంలో అనేక సందర్భాల్లో ఉన్నట్టుండి వేడి పెరుగుతుంది. దీనినే హైపర్థెర్మియా గా పిలుస్తారు. హైపర్థెర్మియా అనేది అసాధారణంగా అధిక శరీర ఉష్ణోగ్రతగా చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈతరహా వేడి చేయటం వంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది వేడి చేయటం అన్నది కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం వల్లనే వచ్చిందని భావిస్తుంటారు. గోంగూర, బొప్పాయి, అవకాయ పచ్చడి, మామిడి పండ్లు ఇతరత్రా ఆహారాలను తినటం వల్లనే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని అనుకుంటారు. వాస్తవానికి అందులో ఏమాత్రం వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్న సందర్భంలోనే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

శరీరంలో నిరంతరం కణజాలం నుండి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి ఉత్పన్నం అయ్యే క్రమలో శరీరంలో వేడి పుడుతుంది. మనిషి యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత దాదాపు 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. ఏదైనా శరీర ఉష్ణోగ్రత 99 లేదా 100 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే శరీరంలో వేడి అధికంగా ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి. జ్వరం ఉన్న సందర్భంలో శరీర ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయో హైపర్ధెర్మియా ఉన్న సందర్భంలో సైతం ఇలాగే శరీరం వేడెక్కుతుంది. మనం తీసుకునే నీటి పరిమాణం తక్కువగా ఉన్న సందర్భంలో ఈ ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. కణజాలంలో ఉండే ఎక్కవ నీరు ఉంటే ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవచ్చు. శరీరంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భంలో శరీరం వేడిగా అనిపించటం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, కళ్ల మంటలు, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. శరీరంలో అధిక వేడి ఉన్న సమయంలో నీటిని అధికంగా తీసుకోవటం మంచిది.

శరీరంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి దేహానికి 70శాతం నీరు, 30శాతం ఆహారం అవసరమౌతుంది. రోజుకు 3లీటర్ల నీరు అవసరమౌతుంది. అదే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి 4 నుండి 5లీటర్ల నీరు తాగటం మంచిది. చాలా మంది వేసవి కాలంలో వేడి చేస్తే వెంటనే సగ్గు బియ్యం జావ, నిమ్మకాయ పంచదార నీళ్ళు, శీతలపానీయాలు వంటి వాటిని సేవిస్తుంటారు. వాస్తవానికి శరీరానికి కావాల్సింది అధిక మోతాదులో నీరు తాగటం. నీళ్లు రక్తంలో త్వరగా కలుస్తాయి. ఇతర ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి అందించే నీరు రక్తంలో కలిసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. తక్షణం వేడిని తగ్గించేందుకు ఎక్కువ మోతాదులో నీరు సేవించటం అన్నది ఉత్తమమైన మార్గం.

శరీరంలో వేడి చేసినప్పుడు ఎక్కువగా పంచదార నీళ్లను, సగ్గు బియ్యం పాయసాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి నీటిని ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే. కానీ నీరు కాదు. కనుక శరీరంలో వేడి చేసినప్పుడు వీటిని తాగడం కంటే నీళ్లను తాగడం వల్లే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది. నీళ్లు చాలా త్వరగా జీర్ణమయ్యి వెంటనే రక్తంలో కలుస్తాయి. నీరు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇవి జీర్ణమవ్వటానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఈ ఆహార పదార్థాలలో ఉండే నీరు రక్తంలో కలవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక మనం నీటినే ఎక్కువగా తాగాలి. ఏతరహా ఆహార పదార్ధాలు తిన్నప్పటికీ శరీరానికి తగిన మోతాదులో నీరు అందించటం మాత్రం మర్చి పోవద్దు. నీరు తగినంత శరీరానికి అందిస్తే శరీరంలో అధిక వేడి అన్న సమస్యే రాదని గమనించాలి.

ఇతరత్రా సమస్యల శరీరంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి అందుకు తగిన కారణాలను పరీక్షల ద్వారా తెలుసుకుని తగిన చికిత్స పొందటం మేలు. అలాకాకుండా సాధారణ ఉష్ణోగ్రతగా భావించి సొంత చికిత్సలు చేసుకోవటం అంత శ్రేయస్కరం కాదు.