Migraine Or Headache
Migraine Or Headache : తరచుగా చాలా మంది మైగ్రేన్ నొప్పికి, తలనొప్పికి తేడా తెలియక అయోమయంలో పడుతుంటారు. సాధారణ తలనొప్పిని సైతం మైగ్రేన్ నొప్పిగా భావించి ఖంగారుపడతారు. తలనొప్పి అనేది తలచుట్టూ ఉండే కండరాలు, రక్తనాళాలు, నరాలు, ఇవన్నీ నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఎదైనా దెబ్బ తగిలిన సందర్భంలో నాడీ కణాల్లో తీవ్రమైన స్పందన కారణంగా పెప్టయిడ్స్, సిరటోనిన్ అనే పదార్ధాలు విడుదలవుతాయి. వీటి వల్ల మెదడు పొరలలో, రక్తనాళాల్లో వాపుని కలుగుతుంది. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఆసందర్భంలో నొప్పిని మెదడుకు తెలియజేస్తుంది. కొనిరకాల మందులు సిరటోనిన్ ని నిలుపుదల చేయటం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తలనొప్పి రావటానికి ముఖ్య మైన కారణాలు విషయానికి వస్తే అలసట, శారీరకంగా,మానసికంగా ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు నిద్రపోవటం, అతిగా ఏడవటం, వేదన చెందడం, శరీరంలో నీరు తగినంత లేకపోవటం , మలబధ్ధకం, గంటలతరబడి కంప్యూటర్ల ముందూ,ఆఫీసులో పనిలో నిమగ్నం కవాటం వంటి వాటి వల్ల కండరాల పట్టుకుపోయి తలనొప్పి వస్తుంది. ఇవి సర్వ సాధారణ మయిన కారణాలు.
సాధారణ తలనొప్పి నుండి ఉపశమనం పొందేందకు ఒత్తిడిని అదుపు చేసుకోవటం, యోగా, ధ్యానం, శ్వాసక్రియలకు సంబంధించి వ్యాయామం, అరోమా ధెరపీ, మ్యూజిక్ ధెరపీ వంటివాటి వల్ల ఈ తరహా తలనొప్పి నుండి బయటపడవచ్చు. రోజు వారిగా క్రమం తప్పకుండా వ్యాయమాలు చేయటం, తినే ఆహారంలో మార్పులు చేసుకోవటం, బరువు తగ్గించుకోవటం , కెఫిన్ కలిగిన కాఫీ వంటి వాటిని తాగటం మానివేయటం పాటించాలి. కొన్ని సందర్భంలో మరీ నొప్పి ఎక్కవగా ఉంటే వైద్యుని సహాయంతో మందులు వాడుకోవటం మంచిది. కంటి చూపులో లోపం ఉన్నా తలనొప్పి అవకాశం ఉంది. అవసరమైతే కంటి వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి.
మైగ్రేన్ నొప్పి విషయానికి వస్తే దీనినే పార్శ్వనేప్పి అని కూడా అంటారు. ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుంది. చాలా మంది ఈనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈనొప్పి వచ్చిన సందర్భంలో తలలో సుత్తులతో కొడుతున్నట్లు, మోతలు రావటం వంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆడవారిలో ఈతరహా మైగ్రేన్ నొప్పి కనిపిస్తుంది. అంతేకాకుండా తలనొప్పితో పాటు వికారం ,వాంతులూ వుంటాయి, ఎక్కవకాంతిని చూడలేకపోతుంటారు. చిన్న శబ్దాలనీ తట్టుకోలేక పోవడం, చీకటి గదిలో నిశ్శబ్ధంగా గడపాలని కోరుకోవటం ఇలాంటి మైగ్రేన్ కలిగిన వారిలో చూడవచ్చు. గంటలతోపాటు, రోజుల పాటు ఈ మైగ్రేన్ నొప్పి వేధిస్తుంది. దీనికి జెనెటిక్ కారణాలతోపాటు, వాతావరణ పరిస్ధితులు కారణంగా చెప్పవచ్చు. నరాల పనితీరు సక్రమంగా లేకపోటం ఈ మైగ్రేన్ కి కారణమని భావిస్తున్నారు.
మైగ్రేన్ నొప్పి వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలను గమనించ వచ్చు. కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం, కళ్లు చీకట్లు కమ్మడం, కళ్ల ముందు వెలుతురు, కళ్లలో నీళ్లు రావడం, కళ్లు ఎర్రగా మారటం, చెవులలో శబ్దాలు, మాట్లాడలేకపోవడం, శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి నెలకు 15 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు పాటు ఉంటే అది దీర్ఘకాలిక మైగ్రేన్ గా భావించవచ్చు. జీవనశైలిలో మార్పులు, వైద్యుల చికిత్స, క్రమం తప్పకుండా వ్యాయామం, తీసుకునే ఆహారంలో మార్పులు చేయటం వంటి వాటితో దీర్ఘకాలిక మైగ్రేన్ ను నిరోధించవచ్చు.