Rambabu Hotel
Rambabu Hotel : నిత్యవసర వస్తువులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో హోటల్స్ లో ఆహార పదార్ధాల ధరలు పెరిగిపోయాయి. చిన్నచిన్న హోటల్స్ లో ప్లేట్ ఇడ్లీ తినాలంటే కనీసం 20 రూపాయలు చేతిలో ఉండాల్సిందే. అదే పెద్ద హోటల్స్ లో అయితే ప్లేట్ ఇడ్లీ ధర 50 రూపాయల నుండి 70రూపాయల వరకు ఉంటుంది. అయితే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఓ హోటల్ లో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్నారు. 16ఏళ్ళుగా ఇదే ధరకు ఆయన విక్రయిస్తుండటంతో ప్రస్తుతం ఆ హోటల్ ఈ ప్రాంతంలో పాపులర్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…
రాయభూపాలపట్నానికి చెందిన చిన రాంబాబు 16 సంవత్సరాలుగా గ్రామంలో తమ ఇంటి వద్దనే హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ పెట్టిన నాటి నుండి తన హోటల్ లో ఇడ్లీ ధర రూపాయిగానే విక్రయిస్తున్నారు. అదే విధంగా మైసూర్ బోండా ధరను కూడా రూపాయికే అమ్ముతున్నారు. ఊర్లోని ఇతర హోటల్స్ అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. అయితే క్రమేపి సరుకుల ధరలు పెరగటంతో మిగిలిన హోటల్స్ ఇడ్లీ ధరలను పెంచేశారు. అయితే రాంబాబు మాత్రం రూపాయికే ఇడ్లీని ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు.
రాంబాబు హోటల్ కెళితే పదిరూపాయల్లో కడుపునిండా ఇడ్లీలు తినవచ్చు. దీంతో కస్టమర్లతో నిత్యం రాంబాబు హోటల్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇడ్లీ ధర తక్కువైన క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు. రొటీన్ కు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను తక్కువ ధరకే ఇడ్లీ, బోండం అమ్ముతున్నట్లు చెబుతున్నాడు రాంబాబు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దెకట్టే పనిలేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తున్నందున పెద్దగా లాభాలు లేకపోయినా నడిపిస్తున్నట్లు చెబుతున్నాడు.
హోటల్ నిర్వాహణలో కుటుంబసభ్యుల సహాకారం అందిస్తున్నారు. రాంబాబు, భార్య, అత్తగారు రాంబాబుకు హోటల్ నిర్వాహణలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. దీనివల్ల పనివాళ్ళతో పనిలేదు. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వారు సైతం రాంబాబు హోటల్ నుండి టిఫెన్ తీసుకు వెళ్ళేందుకు వస్తుంటారు. ఉదయం 5గంటల నుండి 10గంటల వరకు క్షణం తీరిక లేకుండా హోటల్ కార్యక్రమాల్లో రాంబాబుతోపాటు, కుటుంబసభ్యులు బిజీబిజీగా గడుపుతారు.
వేడివేడిగా అందించే టిఫిన్ కోసం రాంబాబు హోటల్ వద్ద ఉదయాన్నే జనం రద్దీగా ఉంటారు. రెండు రకాల రుచికరమైన చట్నీలను అందిస్తున్నారు. రుచికరమైన రాంబాబు హోటల్ టిఫిన్ ను తినేందుకు ఈ ప్రాంత వాసులే కాక పట్టణ వాసులు ఇక్కడికి వస్తున్నారు. భవిష్యత్తులో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తానని రాంబాబు స్పష్టం చేస్తున్నాడు.