Iron
Iron Deficient : మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉంటుంది. దీనికి ఆ రంగు రావటానికి కారణం హీమోగ్లోబిన్. శరీరంలో ఈ హీమోగ్లోబిన్ కు మూలాధారం ఇనుము. ప్రాణవాయువును కణాలకు చేరవేయటం హీమోగ్లోబిన్ యొక్కపని. మరొక విధంగా చెప్పాలంటే కణాలకు ప్రాణవాయువును అందించే ప్రధాన మూలకం ఇనుముగా చెప్పవచ్చు. ఇనుము నిర్వర్తించే ప్రధాన ధర్మం ఇదే.
మన రక్తంలో ఇనుము తగ్గితే రక్తహీనత వస్తుంది. దీని వల్ల గుండెదడ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపిస్తే శరీరంలో మిగతా కణజాలల కన్నా ముందుగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా మెదడులో రక్తనాళాలు ఉబ్బి తలనొప్పికి దారి తీస్తుంది. ఐరన్ లోపానికి గురైతే చాక్ పీస్, మట్టి, దుమ్ము, కాగితాల వంటి వాటిని తినాలనే కోరిక కలుగుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలటం వంటివి జరగవచ్చు. చర్మం పాలిపోతుంది. శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది.
ఆహారంలో ఐరన్ అధికంగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి, ఓపిక పెరుగుతాయి. ఐరన్ అధికంగా ఆకు కూరలు, బెల్లం, మాంసాహారంలో లభిస్తుంది. ఐరన్ లభించే పండ్లలో పుచ్చకాయ, బెర్రీస్, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీలు ముఖ్యమైనవి. వీటిలో ఐరన్ తోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్, ఎ, ఇ కూడా ఉంటాయి. పల్లీలలో ఐరన్ అధికంగా ఉంటుంది. పల్లీలు నానబెట్టి వాటిలో బెల్లం, ఖర్జూరాలను చేర్చుకుని తీసుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రాగులు, సజ్జలలో ఇనుము అధికంగా ఉంటుంది. రాగిజావ, సజ్జరొట్టెలు తినటం అలవాటు చేసుకోవాలి. సరైన ఆహారాలను తీసుకోవటం వల్ల ఐరన్ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు.