Improving Memory
Improving Memory : అధునిక జీవన విధానంలో జ్ఞాపకశక్తి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రతిచిన్న విషయాన్ని మర్చిపోవటమన్నది కామన్ గా మారింది. అటు ఇంట్లో ఉన్నా, ఇటు బయట ఉన్నా, ఆఫీసులో చేయాల్సిన పనులు ఇలా అన్నింటి విషయాల్లో చేయాల్సిన పనులను సరైనా సమయానికి పూర్తిచేయకపోవటం , అనుకున్న పనులను అనుకున్న సమయానికి చేయలేకపోవటం వంటివి చాలా మంది చేస్తుంటారు. దీనికి వారు చెప్పే కారణాల్లో మర్చిపోయాను, గుర్తుకులేదు అని చెప్పటం. ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని విషయాలపై దృష్టి పెట్టలేక చాలా మంది సతమతమౌతున్నారు. మన జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు. జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవటం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు.
సరైన పద్దతిలో ఆహారం తీసుకోవటం ; మీరు తినే ఆహారాలు మీ జ్ఞాపకశక్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు చక్కెర ,ధాన్యం, తాజా కూరగాయలు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. మెదడుకు శక్తి కోసం కరివేపాకు, సెలెరీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు వాల్‌నట్‌లు యాంటీఆక్సిడెంట్లు వంటివి తీసుకోవాలి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటాయి. కొత్త మెదడు కణాల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. ఒమేగా-3 కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల ఆక్సీకరణం నుండి రక్షించడమే కాకుండా మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండటానికి నిద్రలేమి కూడా కారణం కావచ్చు. శరీరానికి సరిపడినంత విశ్రాంతి నివ్వటం చాలా అవసరం. దీని వల్ల మెదడు యాక్టివ్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి మెదడుకు ఏమాత్రం మంచివి కావు. వీటి నుండి మెదడుకు విశ్రాంతిని ఇవ్వటం అవసరం. సెలవుదినాల్లో మెదడుకు ప్రశాంతతకోసం మనస్సుకు ప్రశాంతత కలిగించే యాత్రలకు వెళ్ళటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల మెదడుపై ప్రభావం చూపించే ఒత్తిడి, ఆందోళన లాంటివి దూరమయ్యేందుకు అవకాశం ఉంటుంది.
వ్యాయామం వల్ల మెదడుకు మేలు కలుగుతుంది. దీని వల్ల మెదడులో కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి. తద్వారా జ్ణాపకశక్తి మెరుగయ్యేందుకు వీలుంటుంది. శరీరానికి డి విటమిన్ తగినంత అందేలా ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామాలు చేయటం అలవాటుగా మార్చుకోవటం మంచిది. వీలుంటే గార్డెనింగ్ వర్క్ లో నిమగ్నమైనా మంచి ఫలితం ఉంటుంది. పుస్తకాలు చదవటం, ఆటలు ఆడటం, స్నేహితులతో కలసి సరదాగా ముచ్చట్లు చెప్పటం వంటివి చేసినా జ్ణాపకశక్తి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.