ప్రపంచం ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-GHI) జాబితాలో భారత్ వెనుకపడింది. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ తర్వాతి ర్యాంకుల్లో ఇండియా నిలిచింది. ఇంటర్‌నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IFPRI) ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) రిపోర్టును ప్రకటించింది.
2019వ సంవత్సరానికి సంబంధించిన ఈ రిపోర్టులో ఆకలి, పోషకాహారలోపం ఎక్కువగా ఉన్న 117 దేశాల జాబితాలో 102వ ర్యాంకులో భారత్ నిలిచింది. 2018లో జీహెచ్ఐ విడుదల చేసిన ఆకలి సూచికలో 77దేశాల జాబితాలో 55వ ర్యాంకుకు భారత్ పరిమితమైంది.
దక్షిణ ఆసియా దేశాలైన పాకిస్థాన్ (94), బంగ్లాదేశ్ (88), శ్రీలంక (66) ర్యాంకుల్లో నిలిచి భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు వెల్త్ హంగర్ లైఫ్ అండ్ కన్సరన్ వరల్డ్ వైడ్ రూపొందించిన రిపోర్టు తెలిపింది. ఆకలి సూచికలో దిగువ స్థాయికి పడిపోయిన 45 దేశాల్లో భారత్ ప్రమాదరక స్థాయిలో ఉన్నట్టు పేర్కొంది. 2010లో కంటే ప్రస్తుతం ఎక్కువ దేశాల్లో ఆకలి స్థాయిలు అత్యధికంగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
2030 నాటికి ఈ 45 దేశాలు ఆకలి తక్కువ స్థాయిని అధిగమించే పరిస్థితి లేదని పేర్కొంది. దక్షిణ ఆసియా, ఆఫ్రికా దక్షిణ భాగంలోని సహారా ప్రాంతంలో అత్యధికంగా ఆకలి స్థాయి విలువలు ఉన్నట్టు 2019 GHI రిపోర్టు తెలిపింది. ఈ ప్రాంతాలకు 29.3, 28.4 స్కోరును ఇస్తూనే ఆకలి స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్టు సూచించింది. 2014లో 76 దేశాల ఆకలి సూచిక జాబితాలో భారత్ 55వ ర్యాంకు నుంచి దిగువకు పడిపోయింది.