కఠోర వాస్తవం.. భారత్‌లో అపరిశుభ్రతే.. COVID-19 నుంచి దేశాన్ని కాపాడింది!

  • Publish Date - November 5, 2020 / 01:42 PM IST

India’s Poor Hygiene Protect Against COVID-19: ప్రపంచమంతా కరోనా కోరలో చిక్కుకుంది. మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశంలో పారిశుధ్యం తగినంత స్థాయిలో లేనప్పటికీ కూడా కరోనా నుంచి ఇమ్యూనిటీ పెరిగిందని కొత్త అధ్యయనం వెల్లడించింది. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతీయ సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.



కరోనావైరస్‌పై భారతీయులు గట్టిగానే పోరాడగలుగుతున్నారని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా పారిశుధ్యం (అపరిశుభ్రత) తగినంత స్థాయి కంటే తక్కువగా ఉండటమేనని కారణమంటున్నారు. జనాభాలో అతిపెద్ద దేశమైన ఇండియా మొత్తంలో శానిటైజేషన్, నీటి పరిశుభ్రత పరిమిత స్థాయిలోనే ఉంది. అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారు.

గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఏడాదిలో సగటున 1.2 మిలియన్ల మంది భారతీయులు మృత్యువాత పడుతున్నారు. కానీ, దేశంలో ఇలాంటి దుర్భర జీవన పరిస్థితుల్లో కూడా కరోనా విజృంభించినా ఎంతోమంది ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా కేసుల తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కరోనా కేసుల్లో భారత్ 6వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ జనాభాలో ఆరో వంతు మంది భారతదేశంలోనే నివసిస్తున్నారు.



కానీ, కరోనా మరణాలు మాత్రం ప్రపంచ జనాభాతో పోలిస్తే 10 శాతం మాత్రమే నమోదైంది. ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. ఇండియాలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు దృఢంగా లేకపోవడమే కారణమని విమర్శకులు అంటున్నారు.

లేదంటే కరోనా మరణాలను మరింత నివారించగలమని చెబుతున్నారు. పారిశుధ్యం బాగుండి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్లు తగ్గినప్పటికీ అక్కడి ప్రజల్లో ఆటో ఇమ్యూనో డిజార్డర్లు, అలెర్జీలు వంటి సమస్యలు అధికంగా పెరిగాయని అధ్యయనంలో గుర్తించారు. పారిశుధ్యం బాగున్న దేశాల్లో అక్కడి ప్రజల్లో ఇమ్యూనిటీ స్థాయి ఎలా ఉందో సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆటో ఇమ్యూనో డిజార్డర్లతో బాధపడేవారిలో కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉందని నిర్ధారించారు.



ఈ అధ్యయనంలో భాగంగా 106 దేశాల్లో అందుబాటులో ఉన్న డేటాతో పోల్చి చూశారు. అందులో ఒక మిలియన్ కరోనా మరణాలతో పాటు జీడీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శానిటైజేషన్ డేటాను సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఈ డేటాలో క్షయ మందు అయిన BCG వ్యాక్సినేషన్ తీసుకున్నవారిపై అధ్యయనం చేయగా.. కరోనా మరణాల రేటు చాలా తక్కువగా నమోదైందని గుర్తించారు.



అలాగే ఇతర దేశాల్లో శానిటైజేషన్ పరిస్థితులపై కూడా అధ్యయనం చేశారు. అందులో పారిశుధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చిన్నతనం నుంచే వివిధ అంటురోగాలకు గురైనట్టు గుర్తించారు. తక్కువ పారిశుధ్యం ఉన్న దేశాల్లో అంటురోగాలు ఎక్కువగా ప్రబలుతుంటాయి. అప్పుడు రోగాలను తట్టుకునేలా శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని గుర్తించారు.